జామకాయ, పచ్చి మామిడి పండ్లు తినేటప్పుడు చాలా మంది ఉప్పు, కారం, పంచదార లేదంటే మసాలా అద్దుకుని తింటారు. వాటిని అలా చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందని అనుకుంటారు. కాస్త స్పైసీగా మరికొంచెం తియ్యగా ఉంటాయి. రుచి సరే మరి పోషకాల సంగతి ఏంటి? భారతీయులు ఎక్కువగా ‘ఫ్రూట్ చాట్’ తినడానికి ఇష్టపడతారు. చాట్ లో భాగంగా ఉప్పు, మసాలా చల్లగానే పండ్ల నుంచి నీరు రావడం ఎప్పుడైనా గమనించారా? ఈ నీరు పోషకాల నష్టాన్ని సూచిస్తుంది. అంతే కాదు ఉప్పు, చాట్ మసాలాలో ఉండే సోడియం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అదెలాగో తెలుసా..


బరువు పెరుగుతారు


పండ్లపై చల్లిన ఉప్పు, చాట్ మసాలా లేదా చక్కెర శరీరానికి అవసరం లేదు. ఎక్కువ చక్కెరను జోడించడం వల్ల రోజువారీ కేలరీల సంఖ్య పెరిగిపోతుంది. రోజులో తీసుకోవాల్సిన దాని కంటే అధిక కేలరీలు తీసుకున్నట్టు అవుతుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి.


పోషకాలు ఉండవు


సాధారణంగా పండ్లలో ఉండే పోషకాలు మీరు చల్లుకునే ఉప్పు, కారం, మసాలా చల్లడం వల్ల పోషకాలు నశిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు మాదిరిగా కాకుండా అదొక చిరుతిండిలా మారిపోతుంది. పండ్లలోని అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఇవి బయటకి పంపించేస్తాయి. ఉప్పు లేకుండా పండ్లు తినడం వల్ల తక్కువగా నీరు బయటకి వస్తుంది. అందువల్ల అందులోని పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.


మూత్రపిండాలు ప్రభావితం


పండ్ల మీద ఉప్పు చల్లడం వల్ల అనవసరమైన సోడియాన్ని శరీరానికి జోడించినట్టు అవుతుంది. సోడియం శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. దాని వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఇప్పటికే మీరు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్టయితే పండ్లు ప్రాసెస్ చేయకుండా, ఉప్పు, మసాలా లేకుండా తీసుకోవడం మంచిది. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.


ఉబ్బరం


మసాలాతో కూడిన పండ్లు తినడం వల్ల పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. pH స్థాయిలు, సోడియం కారణంగా శరీరం నీటిని నిలుపుకుంటుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరంగా, గ్యాస్ పట్టేసినట్టు ఉంటుంది. ఇది రోజంతా అసౌకర్యంగా అనిపించేలా చేస్తుంది. మసాలా తింటే సాధారణంగానే కొంతమందికి పొట్టలో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఇక పండ్లతో పాటు దాన్ని తీసుకుంటే అది తీవ్రమైన సమస్యగా మారే ప్రమాదం ఉంది.


ఇలా తినొచ్చు


పండ్లకి మరింత రుచిని ఇవ్వాలని అనుకుంటే అందుకు వేరే మార్గం ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకి ఒకటి ఏదైనా పండు తినడం మంచిది. వేసవిలో పండ్ల మీద యాలకులు, మిరియాలు వేసుకుని తినొచ్చు. అదే శీతాకాలంలో అయితే దాల్చిన చెక్క, లవంగాల పొడిని చల్లుకోవచ్చు. ఇలా తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా రుచికరమైన పండ్లు తిన్న ఫీలింగ్ కలుగుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్‌ని గుర్తించడం ఎలా? చికిత్స ఏమిటి?