కొన్నేళ్ల కిందట దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఐఏఎస్ టాపర్స్ అథార్‌ అమీర్‌ఖాన్, టీనా దాబి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజస్తాన్‌ కేడర్‌‌కు చెందిన ఈ ఐఏఎస్‌ జంట విడాకులు తీసుకుంది. జైపూర్ ఫ్యామిలీ కోర్టులో కొంతకాల కిందట వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది.


దేశంలో ఉన్నత సర్వీసులుగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలలో 2015లో వీరిద్దరూ టాపర్లుగా నిలిచారు. టీనా దాబి టాప్ ర్యాంకు సొంతం చేసుకోగా, కశ్మీర్‌కు చెందిన అమీర్‌ఖాన్‌ రెండో ర్యాంకు సాధించారు. అనంతరం వీరిద్దరికి ఒకే రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వడంతో సంతోషించారు. మరోవైపు ఒకే ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన టీనా, అమీర్ శిక్షణా కాలంలోనే ప్రేమలో పడ్డారు. రాజస్తాన్‌లో వీరిద్దరికీ పోస్టింగ్ లభించడంతో ఒకరికొకరు సమయాన్ని వెచ్చించేవారు. తమ పెళ్లి విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. కానీ వీరి వివాహంపై అప్పట్లోనే దుమారం రేగింది. 


ట్రైనింగ్ పూర్తి చేసుకున్న టీనా దాబి, అమీర్ ఖాన్‌కు జైపూర్‌లోనే పోస్టింగ్‌లు లభించాయి. 2018 మార్చి నెలలో టీనా, అమీర్ వివాహం చేసుకున్నారు.  అమీర్‌ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌ వీరి వివాహానికి వేదికగా మారింది. వివాహం చేసుకుని రెండేళ్లు గడిచిన తరువాత వీరి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. తమ మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి వివాహం జరిగిన సమయంలో లవ్ జిహాద్ అని కొన్ని హిందూ సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా వీరి వివాహం చర్చనీయాంశమైంది. 
Also Read: మీ జీవితంలో ఆ ఇద్దరి మీదా ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు… ఎవరా ఇద్దరు...


గత ఏడాది నవంబర్‌లో వీరు జైపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తాము కలిసి జీవించడం సాధ్యం కాదని, తాము పరస్పరం చర్చించుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు విన్నవించుకున్నారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివిన వారు, దేశంలోని ఉన్నత సర్వీస్‌లో తొలి రెండు స్థానాలు సాధించిన వారు కావడంతో విడాకులపై వెనక్కి తగ్గుతారని కుటుంబసభ్యులు భావించారు. కానీ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని, మూడేళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. వీరి విడాకుల కేసును తాజాగా విచారించిన జైపూర్ ఫ్యామిలీ కోర్టు టీనా దాబి, అమీర్ ఖాన్ తుది నిర్ణయాన్ని మరోసారి తెలుసుకుంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ టాపర్స్ జంటకు ఫ్యామిలీ కోర్టు మంగళవారం నాడు విడాకులు మంజూరు చేసింది.
Also Read: Nayanthara Engagement: డైరెక్టర్ తో లవ్ ఎఫైర్.. తొలిసారి స్పందించిన నయనతార..