వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా విజయం సాధించాలంటే చాణక్య నీతి అన్ని కాలాల్లోనూ చక్కని మార్గదర్శి. తన శిష్యులకు చాణక్యుడు బోధించిన అతి ముఖ్యమైన విషయం నోటిని అదుపులో ఉంచుకోవడం. మనిషి జీవితంలో తలదించుకోవాల్సిన సందర్భాలుంటాయి..తిట్టాల్సిన సందర్భాలుంటాయి…ఎదురు తిరగాల్సిన సందర్భాలుంటాయి.. అయితే ఏ సందర్భంలో ఎవరితో ఎలా వ్యవహరించినా సరే…మన జీవితంలో ఆ ఇద్దరు వ్యక్తులపై మాత్రం ఎప్పుడూ నోరు పారేసుకోరాదని, వారిని తిట్టడం, దూషించటం, దుర్భాషలాడటం చేయరాదన్నాడు చాణక్యుడు.



ఆ ఇద్దరు ఎవరంటే…తల్లిదండ్రులు. మనకు జన్మనిచ్చి, మాట నేర్పిన తల్లిదండ్రులను చెడు మాటలతో హింసించరాదని బోధించారు. ఇలా చేస్తే అది శాపంగా మారుతుందని కూడా హెచ్చరించారు. తల్లి, తండ్రులపై ఎప్పుడు పరుష మాటలు ప్రయోగించవద్దన్నాడు. అన్ని తరాలవారికీ ఇది వర్తిస్తుందన్నాడు. మనం ఎవరి ముందు మాట్లాడుతున్నాం, ఎవరి గురించి ఎలాంటి పదాలు ప్రయోగిస్తున్నామన్నది ఎప్పుడూ గుర్తెరిగే మాట్లాడాలని చాణక్యుడు హెచ్చరించారు. "ఒక్కసారి సంధించిన బాణాన్ని మళ్లీ వెనక్కు తీసుకోగలమా.. సరిగ్గా ఇలాంటిదే మీ తల్లిదండ్రులపై దురుసైన మాటల ప్రయోగం, దీని పర్యవసానం భరించక తప్పదు".. అజ్ఞానంతో అమ్మా, నాన్నలను తిట్టకూడదంటూ, ఇదంతా కర్మ అని ఆయన తన బోధనల్లో వివరించాడు.


బాగా కోపం వచ్చినప్పుడు, అసహనంతో రగిలిపోతున్నప్పుడు తల్లిదండ్రులే పిల్లలకు టార్గెట్ అవుతారు. లోకంలో అత్యంత సహజంగా జరిగే పని. ఎవరిపైనా కోపం చూపించలేని సందర్భాల్లో త్లలిదండ్రులపై నోరు పారేసుకునేవారి సంఖ్య ఎక్కువే. ఇలాంటి సందర్భాల్లో కఠిన పదాలు ప్రయోగిస్తుంటారు. పిల్లల ఉద్దేశం నిజంగా అది కాకపోయినప్పటికీ ఆగ్రహాన్ని అణచుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడతారన్నాడు చాణక్యుడు. చెడ్డ ఉద్దేశం లేకపోయినప్పటికీ ఇలాంటి మాటలు తూలితే వాటి పర్యవసానాన్ని భవిష్యత్తులో అనుభవించక తప్పదని, ఇవే శాపాలై వేధిస్తాయని చాణక్యుడు హెచ్చరించారు.


ఒక వ్యక్తి భౌతిక సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని, కేవలం సంపద, హోదా అతని ఖ్యాతిని పెంచలేవంటాడు చాణక్యుడు. ఈ సంపద కన్నా, ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయి అన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుంది అని తన అర్ధశాస్త్రంలో చెప్పాడు. 9 నెలలు కడుపులో భద్రంగా మోయడమే కాదు… బాహ్య ప్రపంచంలో మీ క్షేమం కోసం నిరంతరం పాకులాడే నిస్వార్ధ జీవి అమ్మ. బిడ్డ పుట్టక ముందు నుండే భాద్యతలు కలిగి ఉండే వ్యక్తి తండ్రి. దేవుడు భూమ్మీద అన్నిచోట్లా లేడు కాబట్టి అతను తల్లిదండ్రులను సృష్టించాడు. మీరు ఎంతగా ఎవరిని ప్రేమించినా, తల్లిదండ్రుల ప్రేమను మాత్రం భర్తీ చేయలేరంటాడు. అందుకే తల్లిదండ్రులను అవమానపరిచే విధంగా మాట్లాడడటం తగదని శిష్యులకు బోధించాడు చాణక్యుడు.