Threat To Dalai Lamaa:


బోధ్ గయాలో దలైలామా..


ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దలైలామా ప్రస్తతుం బిబార్‌లోని బోధ్ గయాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సంచనల విషయం వెలుగులోకి వచ్చింది. దలైలామాపై చైనాకు చెందిన ఓ మహిళ నిఘా పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు దలైలామాకు భద్రత పెంచారు. మహిళా గూఢచారి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. బోధ్‌గయాలో ఆమె పలు చోట్ల పర్యటించినట్టు నిఘా వర్గాల సమాచారం. ఫలితంగా పోలీసులు అందరినీ అప్రమత్తం చేశారు. ఆమె ఫోటోతో పాటు పాస్‌పోర్ట్ నంబర్, వీసా వివరాలు కూడా పోలీసులు షేర్ చేశారు. వీలైనంత త్వరగా ఆమెను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పేరు సాంగ్ జియోలాన్‌ అని పోలీసులు వెల్లడించారు. సాధువు వేషంలో బోధ్ గయాకుఆమె వచ్చినట్టు చెబుతున్నారు. స్కెచ్ విడుదల చేసిన వెంటనే గయా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు. కీలక ప్రాంతాల్లోని హోటల్స్‌ అన్నింట్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. బోధ్ గయాలోని కాల్‌చక్ర మైదాన్‌లో దలైలామా నేతృత్వంలో ఓ కార్యక్రమం జరగనుంది. 50 దేశాలకు చెందిన 2 లక్షల మంది బౌద్ధ భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దలైలామా ప్రసంగం వినేందుకు మొదటి రోజే 40 వేల మంది తరలి వచ్చారు. మొత్తం మూడు రోజుల పాటు అక్కడే దలైలామా పర్యటన కొనసాగనుంది. 


తదుపరి దలైలామాపై వాదనలు..


చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందన్న వార్త అలా బయటకు వచ్చిందో లేదో...వెంటనే బుద్ధ సంఘాలు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టాయి. దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి. భారత్‌లోని బౌద్ధ సంస్థలన్నీ 
ఇదే మాటను ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బౌద్ధ సంఘాలు చైనాకు వ్యతిరేకంగా నిరనసలూ చేపడుతున్నాయి. తన తరవాత ఎవరు ఆ పదవిలో ఉండాలన్నది దలైలామా మాత్రమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పాయి. అయితే అటు చైనా మాత్రం తరవాతి 
దలైలామాను ఎంచుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఈ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెబుతోంది. నిజానికి...టిబెట్‌ చైనాలో భాగమే అని డ్రాగన్ ఎప్పటి నుంచో మొండిగా వాదిస్తోంది. అందుకే...దలైలామా విషయంలో తమ నిర్ణయమే నెగ్గాలని భావిస్తోంది. 
ఇదే సమయంలో దలైలామా మాత్రం స్వతంత్ర టిబెట్‌ కోసం ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవడంలో చైనా విఫలమైతే...టిబెట్‌ను దక్కించుకోవడమూ అంత సులభం కాదు. అందుకే అంత పంతంగా ఉంది డ్రాగన్. 
మరోవైపు లద్దాఖ్ నుంచి ధర్మశాల వరకూ బౌద్ధ సంఘాలు చైనా వైఖరిని తప్పు బడుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలన్నీ చైనాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దలైలామా ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాకు తిరిగి వెళ్లే ఆలోచనే లేదని, ఇండియా తనకు సొంతిల్లు లాంటిదని అన్నారు. భారత్ తనకు శాశ్వత నివాసం అని వెల్లడించారు.  "చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నాకు భారత్‌లో ఉండటమే ఇష్టం. ఇండియా నాకెంతో నచ్చింది. కంగ్రాలో ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ నాకు చెప్పారు. ఇదే నాకు శాశ్వత నివాసం" అని  స్పష్టం చేశారు. 


Also Read: Argentina Tourist Missing: కొవిడ్ పేషెంట్ మిస్సింగ్, ఆందోళనలో అధికారులు - జల్లెడ వేస్తున్న పోలీసులు