తెలంగాణ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామయ్య (భార్య తండ్రి) పాకాల హరినాథరావు మరణించారు. ఆయన కరోనరీ సిండ్రోమ్, కార్డియోజెనిక్ షాక్, ఎనోక్సిక్ బ్రెయిన్ ఇంజూరీ కారణాలతో చనిపోయారు. ఈ మేరకు ఆయన చికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్పత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. పాకాల హరినాథ్ రావు అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం డిసెంబరు 27న చేరారని పేర్కొన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేదని డిసెంబరు 29 మధ్యాహ్నం 1.10 నిమిషాలకు చనిపోయారని ప్రకటనలో వెల్లడించారు. 


హరినాథరావు అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ (Acute Coronary Syndrome), కార్డియోజెనిక్ షాక్ (Cardiogenic Shock), ఎనోక్సిక్ బ్రెయిన్ ఇంజూరీ (Anoxic Brain Injury) కారణాలతో చనిపోయారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అక్యూట్ కరోనరీ సిండ్రోమ్‌ పదజాలాన్ని వైద్య పరిభాషలో గుండెలోని రక్త నాళాలకు రక్త సరఫరా నిలిచిపోయిన సందర్భంలో వాడతారు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇంకోవైపు, శరీరానికి కావాల్సినంత రక్తాన్ని గుండె పంప్ చేయడంలో విఫలం అవ్వడాన్ని కార్డియాక్ షాక్‌గా పిలుస్తారు. ఇది ప్రాణాపాయ స్థితిగా భావిస్తారు. 


రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల మెదడుకు తగినంత ఆక్సీజన్ సరఫరా నిలిచిపోవడంతో అందులోని కణాలు చచ్చిపోతాయి. ఈ స్థితిని ఎనాక్సిక్ బ్రెయిన్ ఇంజురీగా పిలుస్తారు.


హరినాథరావు గుండెపోటుతో బుధవారం రాత్రి చనిపోయినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రధాన మీడియా సైతం ఆయన కన్నుమూశారని వార్తలు ప్రచురించింది. తాజాగా ఆ వార్తలను ఖండిస్తూ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేసి స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే హరినాథరావు చనిపోయినట్లుగా ఆస్పత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు.