నిన్నటి వరకు అభివృద్ధిపై పార్టీల మధ్య సవాళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు స్కాంలు, డ్రగ్స్ వంటి వాటిపై పార్టీల మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. పాలనలో పోటీపడాల్సిన రాజకీయనేతలు, పార్టీలు ఇప్పుడు అవినీతిలో పోటీపడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ విమర్శలు ఎప్పుడో వ్యక్తిగతంగా మారిపోయాయి. అయితే నిన్నటివరకు నీ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది.. మీ పార్టీ ప్రజలకు ఏం చేసింది అన్నదానిపై రాజకీయనేతలు, పార్టీలు సవాళ్లు చేసుకునేవి. ఎనీ సెంటర్ ఎనీ టైమ్ ప్రజా వేదికపై చర్చకు సిద్ధమా అని నేతలు సవాళ్లకు తెరలేపేవారు.
ఇప్పుడు రోజులు మారాయి. రాజకీయాలు మారాయి. కొత్త ట్రెండ్ లో కొత్త సవాళ్లతో కొత్త పోకడలకు పోతున్నారు రాజకీయనేతలు, పార్టీలు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధికార బీఆర్‌ఎస్, బీజేపీ ప్రస్తుతం అవినీతి, డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి వాటిపై దృష్టి పెట్టాయి. ప్రస్తుతం ఈడీ-ఐటీ -సిట్ వంటి కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ఇరు పార్టీలు యుద్ధం చేస్తున్నాయి. ఈ ఫైటింగ్ ఎప్పటివరకు ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఇరు పార్టీల నేతలు ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారు..ఏ రూపంలో స్కాంలు చేస్తున్నారు.. ఎవరు ఏ దందాలు నడిపిస్తున్నారు అన్నదానిపై సవాళ్లు చేసుకుంటున్నారు. ఇది ఇంకా నడుస్తూ ఉండగానే ఇప్పుడు ఇంకాస్త దూకుడు పెంచారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో మంత్రి కెటిఆర్ హస్తం ఉందని ఆరోపిస్తోంది బీజేపీ. అంతేకాదు డ్రగ్స్ అలవాటున్న కెటిఆర్ దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని సవాల్ విసిరారు. అసలు కెసిఆర్ ఆయన పార్టీ నేతలంతా కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుంటే అసలు నిజాలు బయటకొస్తాయని బీజేపీ గతకొంతకాలంగా ఆరోపిస్తూనే ఉంది. అంతేకాదు బెంగళూరు డ్రగ్స్ కేసుని తిరగతోడతామని చెప్పిన కొద్దిగంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడంతోపాటు ఇప్పుడు న్యూఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున జరిపిన దాడుల్లో భారీగా మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సవాల్ పై స్పందించిన కెటిఆర్ మొన్నా మధ్య నా బొచ్చుతో సహా శరీరంలోని అన్ని భాగాలు ఇస్తాను టెస్ట్ చేసుకోమని బీజేపీ నేతలకు ప్రతిసవాల్ విసిరారు. అంతేకాదు తప్పని తేలితే కరీంనగర్ నడిబోడ్డున చెప్పుతో కొట్టుకోవాలని బండి సంజయ్‌తో పాటు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
కేటీఆర్ సవాల్‌పై కాషాయం పార్టీ కూడా ఘాటుగానే స్పందించింది. ఎప్పుడో సవాల్ చేస్తే ఇప్పుడా స్పందించేది.. విదేశాలు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్నాక స్పందించం కాదని ఎద్దేవా చేసింది. ఇక ఇప్పుడు లైడిటెక్టర్ , నార్కో ఎనాలిసిస్ టెస్ట్‌ల వంతు వచ్చింది. ఎమ్మెల్యేల కోనుగోళ్లు కేసుని తెలంగాణ హైకోర్టు సిబీఐకి అప్పగించడంపై బీజేపీ హర్షం వక్తం చేసింది. అంతేకాదు అధికార పార్టీ తీరుపై కాషాయం నేతలు తమదైన స్టైల్లో విమర్శలు చేయడంతో మంత్రి కెటిఆర్ సీరియస్ గానే తీసుకున్నారు. స్కాంతో సంబంధంలేదన్నోళ్లు ఇప్పుడు సీబీఐకి కేసు వెళ్లగానే ఎందుకు చంకలు గుద్దుకుంటున్నారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే సెంట్రల్ బీజేపీ ఇన్వేస్టిగేషన్ గా మారిన సీబీఐ దర్యాప్తుతో పాటు నార్కో , లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ పై బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక రానున్న రోజుల్లో ఎలాంటి సవాళ్లు ప్రజల ముందుకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.