KCR Faces Challenges : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సవాళ్లు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు భారత రాష్ట్ర సమితిని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయాలని ఆయన అనుకుంటున్నారు. కానీ వరుసగా వస్తున్న వివాదాలు, పార్టీ నేతలపై కేసులు, తెలంగాణ ఆర్థిక సమస్యలు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి రావడం వల్ల .. దేనిపైనా పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో అనుకున్న పనులన్నీ వాయిదా పడుతున్నాయి. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ గందరగోళానికి కారణం అవుతోంది. తాజాగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో బాధితురాలిగా ఉన్న బీఆర్ఎస్ .. కేసు సీబీఐకి వెళ్లడం వల్ల మరింత టెన్షన్ కు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కేసీఆర్ దీనిపైనా దృష్టి పెట్టాల్సి ఉంది.
పార్టీ నేతలను చుట్టు ముడుతున్న వివాదాలు !
బీఆర్ఎస్ పార్టీ నేతలను వరుసగా కేసులు చుట్టు ముడుతూండటం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. వారికి న్యాయ సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేుకుంటున్నారు. ఫామ్ హౌస్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అంశాన్ని టేకప్ చేశారు. దాదాపుగా ప్రతీ రోజూ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ ప్రత్యేకంగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్ కేసు పూర్తిగా సీబీఐకి చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాల్సి ఉంది. లేకపోతే.. ఈ కేసు అనేక మలుపులు తిరిగి రాజకీయంగా కేసీఆర్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కేసీఆర్ తన సమయాన్ని వెచ్చించక తప్పదని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
బీఆర్ఎస్ విస్తరణ ప్రణాళికలు ఆలస్యం !
క్రిస్మస్ తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు. కానీ వెళ్లలేకపోయారు. ఆరు రాష్ట్రాలకు కిసాన్ సెల్ కమిటీలను ప్రకటించాలనుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. ఢిల్లీలో ప్రకటించి.. అక్కడే మీడియాతో మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఢిల్లీ పర్యటనే వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ఢిల్లీకి వెళ్తారన్నదానిపై స్పష్టత లేదు. అదే సమయంలో బీఆర్ఎస్ తరపున అన్ని రాష్ట్రాలకు కన్వీనర్లను నియమించాలని అనుకుంటున్నారు. ఈ కసరత్తు చేయాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు ప్రగతి భవన్ కు వచ్చి కలుస్తున్నారు. అయితే ఎవర్ని ఎంపిక చేయాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ భావజాలాన్ని మరింతగా తీసుకెళ్లడానికి సాహితీ వేత్తలతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలూ నిర్వహించలేకపోయారు !
కేంద్రం వల్ల తెలంగాణకు రూ. 40వేల కోట్లకుపైగా ఆదాయ నష్టం జరిగిందని..ఈ విషయాన్ని అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించి ప్రజల ముందు ఉంచారని కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్‌లో వారం పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆదేశించారు.అయితే ఈ నెల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేకపోయారు. దీనికి కారణం.. బీఆర్ఎస్‌కు అధికారికంగా ఆమోద ముద్ర పడటం.. లిక్కర్ స్కాం కేసు, ఫామ్ హౌస్ కేసుల్లో ఈడీ జోక్యం వంటి ఘటనలు చోటు చేసుకోవడమే. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదన్న చర్చ జరుగుతోంది. దానిపైనా కేసీఆర్ దృష్టి పెట్టాల్సి లఉంది. వీటిపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో .. తాను ఓ పిలుపు ఇస్తే మిగతా మొత్తం పార్టీ నేతలు చూసుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతీ అంశాన్ని తానే చూసుకోవాల్సి వస్తూండటంతో.. కేసీఆర్ కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.