కొన్ని జంతువులు పగ పడతాయని తెలుసు... ఆ పగ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి, ఎన్ని సంవత్సరాలైనా వేచి చూస్తాయి. తాజాగా ఓ కోతి తనను పట్టించిన వ్యక్తి పై పగ తీర్చుకునేందుకు ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగెహరా గ్రామంలో ఓ మగ కోతి ఐదు సంవత్సరాలుగా అక్కడే జీవనం సాగిస్తోంది. అయితే, ఇది ఫ్రూట్స్, స్నాక్ ప్యాకెట్లను ఎత్తుకుపోయేతి. కోతి స్వభావమే ఇది కదా అని గ్రామస్థులు అంతగా పట్టించుకోలేదు. ఆ గ్రామంలో కొద్ది రోజులు క్రితం పాఠశాలలు రీ ఓపెన్ చేశారు. కోతి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో ఓ వ్యక్తి ఫారెస్ట్ డిపార్టుమెంట్ వారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు
దీంతో ఈ కోతిని పట్టుకునేందుకు సెప్టెంబర్ 16న అటవీ శాఖ రంగంలోకి దిగింది. దాన్ని పట్టుకునేందుకు స్థానికులు, ఆటోడ్రైవర్ల సాయం కోరారు. ఆటో డ్రైవర్ జగదీశ్ అటవీ సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అందరూ కలిసి కోతిని పట్టుకునేందుకు ఓ ఐడియా వేశారు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం జగదీశ్... కోతిని రెచ్చకొట్టేందుకు ప్రయత్నించాడు. కోతికి కోపమొచ్చి అతడిపై దాడి చేసింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో జగదీశ్ గాయపడ్డాడు. 30 మంది సాయంతో అటవీ శాఖ సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి కోతిని పట్టుకున్నారు. అనంతరం దాన్ని తీసుకెళ్లి 22కి.మీ దూరంలో ఉన్న బలూర్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
కోతి కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలైన కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఆ కోతి... ఆటో డ్రైవర్ జగదీశ్ పై పగపట్టింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని సమయం కోసం ఎదురుచూసింది. అలా కొన్ని రోజులకు కోతి... అడవి నుంచి తప్పించుకుని ట్రక్కు ఎక్కి 22 కిలోమీటర్లు ప్రయాణించి మరీ తిరిగి ఆ గ్రామానికి వచ్చింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ నోటా ఈ నోటా ఈ కోతి తిరిగి వచ్చిందన్న విషయం జగదీశ్ వరకు వెళ్లింది. దీంతో ఒక్కసారిగా జగదీశ్ షాకయ్యాడు. తన మీదే పగ తీర్చుకోవడానికి కోతి వచ్చిందని భావించి ఇంటి నుంచి బయటికి రాలేదు. మరోసారి అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన సిబ్బంది ఆ కోతిని పట్టుకున్నారు. అయితే, ఈ సారి బలూర్ అటవీ ప్రాంతంలో కాకుండా ఇంకా దూరంలో ఉన్న మరో అటవీ ప్రాంతంలో దాన్ని వదిలిపెట్టారు. మరి, కోతి ఇక తన పంతాన్ని వదులుకుంటుందో... మళ్లీ జగదీశ్ కోసం తిరిగి వస్తుందో?