Kejriwal on Sisodia:
సీబీఐ సమన్లు..
ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను CBI వెంటాడుతోంది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ప్రస్తుతం ఆయన సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఆదివారం సీబీఐ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. దీనిపై సిసోడియా స్పందించారు. "నేను వెళ్తాను. సీబీఐ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. దాదాపు 14 గంటల పాటు నా ఇంట్లో సోదాలు చేశారు. ఇది చాలదని మా గ్రామానికీ వెళ్లి అక్కడా రెయిడ్స్ కొనసాగించారు. మేం తప్పు చేశామనటానికి ఇప్పటి వరకూ వాళ్లకు ఎలాంటి ఆధారాలు లభించ లేదు" అని ట్వీట్ చేశారు. ఆగస్టులో సిసోడియా ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు మరి కొందరు ఇళ్లలోనూ రెయిడ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవిద్ కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. "మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేస్తారు. డిసెంబర్ 8వ తేదీ తరవాత గుజరాత్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాకే ఆయనను విడుదల చేస్తారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా చేయటమే వాళ్ల వ్యూహం" అని మండి పడ్డారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ అగ్ర నేత మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు సీబీఐ ఆదివారం సమన్లు జారీ చేసింది. సీబీఐ కార్యాలయానికి చేరుకునేముందు సిసోడియా ఓ ట్వీట్ చేశారు.
" నాపై పూర్తిగా ఫేక్ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారానికి గుజరాత్ వెళ్లాల్సి ఉంది. వాళ్లు (భాజపా) గుజరాత్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోబోతున్నారు. అందుకే నన్ను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేయడమే వారి ఉద్దేశం. "
మనీశ్ సిసోడియా, దిల్లీ డిప్యూటీ సీఎం
ఈ కేసులో..
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉన్న సిసోడియా బ్యాంకు లాకర్‌ను కూడా ఆయన సమక్షంలో సీబీఐ పరిశీలించింది.
Also Read: Congress President Poll: ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా - అధ్యక్ష ఎన్నికపై సోనియా గాంధీ