Dilip Mahalanabis Passes Away:


కలరాకు మందుగా..


ఎవరికైనా కాస్త నీరసంగా అనిపిస్తే..తక్షణ శక్తినిచ్చే డ్రింక్ తాగాలంటారు. కొందరు ఉప్పు, నిమ్మకాయ కలిపిన నీళ్లు తాగుతారు. ఇంకొందరు గ్లూకోజ్ పౌడర్ కలుపుకుని తాగేస్తారు. కానీ...వీటన్నింటి కన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది ORS.ఈ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీని కనిపెట్టిన డాక్టర్ దిలీప్ మహాలనబీస్ (Dr. Dilip Mahalanabis) కన్నుమూశారు. 87 ఏళ్ల దిలీప్..కొద్ది రోజులుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వయసు రీత్యా వచ్చిన సమస్యలతో పాటు...లంగ్స్ ఇన్‌ఫెక్షన్ కూడా ఉండటం వల్ల ఆయన మృతి చెందారు. ఆయన గురించి మొట్టమొదటి సారి ప్రపంచానికి తెలిసింది 1971లో. బంగ్లాదేశ్‌లో విమోచన యుద్ధ సమయంలో కలరా తీవ్ర స్థాయిలో ప్రబలింది. అప్పుడే డాక్టర్ దిలీప్  మహాలనబీస్  ORS (Oral Rehydration Solution)ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వేలాది మంది ప్రాణాలను ఈ ద్రావణంతోనే కాపాడారు. పశ్చిమ బెంగాల్‌లోని బాంగాన్ శరణార్థుల క్యాంప్‌లో దీన్ని పంచి పెట్టారు. శరీరం డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండేందుకు ORSని వినియో గిస్తారు. ఆయన మృతికి పలువురు వైద్య నిపుణులు సంతాపం తెలిపారు. "కలరా లాంటి మహమ్మారికి అత్యంత తక్కువ వ్యయంతో అద్భుతమైన మందు కనుగొనటం ఆయనకే సాధ్యమైంది. ఆయన వైద్య రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయం" అని చెప్పారు. డాక్టర్ దిలీప్ మహాలనబిస్ చిన్న పిల్లల వైద్య నిపుణుడు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (కోల్ కతా) లో రీసెర్చ్ స్కాలర్ గా పని చేశారు.  1966లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ORT)  ప్రాజెక్టుపై అధ్యయనం చేశారు. డాక్టర్ డేవిడ్ ఆర్నలిన్, డాక్టర్ రిచర్డ్ ఏ క్యాష్ తో కలసి పరిశోధనలు కొనసాగించారు. తరవాతే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని  వీరు తయారు చేశారు.