Multi Bagger Stock: స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసేవాళ్లకు మల్టీబ్యాగర్ పదం అంటే సుపరిచితమే. పెట్టుబడిని వేగంగా కొన్ని రెట్లు పెంచే స్టాక్స్‌ను మల్టీబ్యాగర్లుగా పిలుస్తాం. మనకు తెలిసిన మల్టీబ్యాగర్ స్టాక్స్ 3 రెట్లు లేదా 4 రెట్లు.. గట్టిగా చెప్పుకుండే ఓ 10 రెట్లు పెరిగి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పబోయే స్టాక్ మల్టీబ్యాగర్లకే గాడ్‌ఫాదర్ లాంటిది. అది ఇచ్చిన రిటర్న్స్ వింటే బుర్ర గిర్రున తిరగడం ఖాయం.
ఆ గాడ్‌ఫాదర్ లాంటి స్టాక్ పేరు బరోడా రేయాన్ కార్పొరేషన్ లిమిటెడ్ (Baroda Rayon Corporation Ltd). BSE కోడ్ 'BOM: 500270'. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో, 'XT' విభాగంలో ట్రేడ్ అవుతోంది. ఒక్కో షేరు ముఖ విలువ 10 రూపాయలు.
ఐదు నెలల క్రితం, జూన్ ప్రారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ఈ స్టాక్ లిస్ట్ అయింది. అప్పట్నుంచి ప్రతి సెషన్‌లోనూ 5 శాతం అప్పర్‌సర్క్యూట్ కొడుతూనే ఉంది. క్రితం రోజు రికార్డ్ బద్ధలు కొట్టడం, కొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరడం - ప్రతిరోజూ ఇదే తంతు. ఈ ఐదు నెలల్లో ఏ రోజూ ఇందులో మార్పు రాలేదు. ఇవాళ్టి ట్రేడ్‌లోనూ (సోమవారం - 17.10.2022) ఇది 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది.
7,055 శాతం పెరుగుదల
గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 142 శాతం పైగా పెరిగింది. లిస్టయిన దగ్గర్నుంచి చూస్తే ఈ ఐదు నెలల్లో 7,055 శాతం దూసుకెళ్లింది. మీరు చదివింది నిజమే. ఇవాళ్టితో కలుపుకుని, ఈ ఐదు నెలల్లోనే ఈ స్క్రిప్ ఏడు వేల యాభై ఐదు శాతం పెరిగింది.
ఒక లక్షకు రూ.70,55,000 ఆదాయం
లిస్టయిన రోజు ఈ షేర్ ధర రూ. 4.64 రూపాయలు. ఇవాళ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో కలిపి అది చేరిన ధర రూ.345. ఈ వృద్ధిని శాతంలోకి కనిపించే సంఖ్య 7,055 శాతం. ఇంకా సింపుల్‌గా చెప్పుకుంటే, ఈ స్క్రిప్ లిస్ట్ అయినప్పుడు దీనిలో మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇవాళ్టికి ఆ డబ్బు 70 లక్షల 55 వేల రూపాయలు అయి ఉండేది. రూ.లక్ష పెట్టుబడికి ఐదు నెలల్లోనే 70,55,000 రూపాయల ఆదాయం. ఇందులో మీ పెట్టుబడి రూ.లక్షను తీసేస్తే మీకు మిగిలిన లాభం రూ.69,55,000. అక్షరాలా అరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు.
షేర్లను ఇప్పుడు కొనొచ్చా?
BSE XT గ్రూప్‌లో ఈ షేర్లు ట్రేడ్ అవుతున్నాయని పైన చెప్పుకున్నాం కదా. అంటే, ఇవి మనలాంటి వాళ్లు కొనడానికి (రిటైల్ ట్రేడింగ్) అందుబాటులో లేవు. ట్రేడ్-టు-ట్రేడ్ ప్రాతిపదికన సెటిల్‌మెంట్లు జరుగుతాయి.
కంపెనీ వ్యాపారం
30/06/1958 తేదీన ఈ కంపెనీని స్థాపించారు. గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా వస్త్ర వ్యాపారం చేస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తోంది. విస్కోస్ ఫిలమెంట్ నూలు, నైలాన్ నూలు, పాలిస్టర్ నూలుతో పాటు మరికొన్ని ఉప ఉత్పత్తుల తయారు చేసి అమ్ముతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.