Congress President Poll: 


చాలా కాలంగా నిరీక్షిస్తున్నా: సోనియా


దాదాపు 20 ఏళ్ల తరవాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరుగుతోంది. పోలింగ్‌ కొనసాగుతోంది. పార్టీ నేతలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలోని AICC కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు వేశారు. భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ..కర్ణాటకలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎంతో కాలంగా నేను ఈ ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నాను" అని అన్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్‌ కూడా ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "కాంగ్రెస్ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజు. 22 ఏళ్ల తరవాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతోంది. పార్టీలోని ఐకమత్యానికి ప్రతీక ఈ ఎన్నిక. అక్టోబర్ 19వ తేదీ తరవాత కూడా (ఫలితాలు విడుదలయ్యే రోజు) గాంధీ కుటుంబంతో నాకున్న సత్సంబంధాలు అలాగే కొనసాగుతాయి" అని స్పష్టం చేశారు గహ్లోట్.









కర్ణాటకలో కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ కూడా స్పందించారు. "కాంగ్రెస్‌ పార్టీకి ఇదో చరిత్రాత్మక రోజు.


కర్ణాటకలో 490 మంది ఈ ఎన్నికలో ఓటు వేస్తున్నారు. పోలింగ్ చాలా పారదర్శకంగా సాగుతోంది. ఈ ఎన్నికతో పార్టీ బలోపేతమై కచ్చితంగా దేశానికి ఎంతో కొంత మంచి జరుగుతుంది" అని వెల్లడించారు. ఇక ఈ రేసులో ఉన్న ఎంపీ శశిథరూర్‌ కూడా ఓటు వేసిన తరవాత తన అభిప్రాయాలు పంచుకున్నారు. "కాంగ్రెస్ భవితవ్యం కార్యకర్తల చేతుల్లోనే ఉంది. అందరూ ఆ అభ్యర్థికే (మల్లికార్జున్ ఖర్గే) మద్దతునివ్వటం వల్ల మాకు కాస్త అడ్డంకులు ఎదురయ్యేలా ఉన్నాయి" అని అన్నారు. "ఫలితాలు ఎలా వచ్చినా నేను, ఖర్గే మిత్రులుగానే కొనసాగుతాం" అని
చెప్పారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. అక్టోబర్ 19వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. 9 వేల మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC)ప్రతినిధులు ఓటు వేస్తారు. 






ఎవరో విజేత..? 


ఒకే వ్యక్తి ఒకే పదవి అనే నిబంధన ప్రకారం...గహ్లోట్ పార్టీ అధ్యక్షుడైతే...రాజస్థాన్ సీఎంగా కొనసాగేందుకు వీలుండదు. ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం నిబంధనకు ఆయన కట్టుబడలేదు. ఫలితంగా...అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. చివరకు రేసులో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తరవాత దిగ్విజయ్ సింగ్ పేరు వినిపించినా...ఆయనా చివరి నిముషంలో నామినేషన్ వేయకుండా ఉపసంహరించుకున్నారు. ఇన్ని మలుపుల తరవాత ఖర్గే, థరూర్ పేర్లు ఖరారయ్యాయి. ఇద్దరూ నామినేషన్ వేశారు. 20 ఏళ్ల తరవాత జరుగుతున్న ఎన్నిక అవటం వల్ల ఎవరు విజేతగా నిలుస్తారన్న ఆసక్తి నెలకొంది. 


Also Read: UK Political Crisis: యూకే ప్రధాని లిజ్‌ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం! ప్లాన్ రెడీ చేసుకున్న 100 మంది ఎంపీలు