ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించాలని లేకపోతే సిబ్బందిని సరెండర్ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి విచారణ చేపట్టే వరకు విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ 12తో పాటు రెండు జీవోలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఎయిడెడ్‌ తొలగిస్తే విద్యార్థులు నష్టపోతారంటూ వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.  


ఎయిడెడ్ కాలేజీల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని భావిస్తున్నఏపీ ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఎయిడెడ్ కాలేజీల్లోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌తోపాటు ఇతర పథకాలు వర్తింప చేస్తోంది. ఎయిడెడ్‌ కాలేజీల్లోని రెగ్యులర్‌ సిబ్బందికి జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం కూడా ప్రభుత్వం నిధులు  ఇస్తోంది. అయినా ప్రమాణాలు పడిపోతున్నాయని ప్రభుత్వం భావించింది. రుణభారం లేకుండా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ప్రైవేటు ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలను స్వాధీనం చేయడానికి సుముఖంగా ఉండే యాజమాన్యాలు, సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.


స్వచ్చందంగా ముందుకు రాని ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలకు  ఎయిడ్‌ నిలిపివేయాలని నిర్ణయించుకుంది.  వాటిల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అధ్యాపకులను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఇందుకోసం ఏపీ విద్య చట్టాన్ని సవరించారు. ఇది అమలులోకి వస్తే ఎయిడెడ్‌ విద్యా సంస్థల వ్యవస్థ కనుమరుగు అవుతుందని విద్యా వేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఇచ్చేస్తే ప్రభుత్వ కాలేజీ..  ఇవ్వకపోతే ప్రైవేటు కాలేజీలుగా నడుపుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అప్పగించాల్సి వస్తే ఎలాంటి రుణాల్లేకుండా  ఆస్తులతో సహా అప్పగించాల్సి ఉంటుంది.  ఏపీ వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చాలా కొద్దిగా మాత్రమే యాజమాన్యాలు ప్రభుత్వానికి ఆస్తులతో సహా అప్పగించేందుకు ముందుకు వస్తున్నాయి. 


మెజార్టీ ఎయిడెడ్ కాలేజీలకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్, జీవోల్లో కూడా పేర్కొన్నారు. బాగా నడుస్తున్న ఎయిడెడ్ కాలేజీలకు ఎయిడ్ కొనసాగించి.. ఇబ్బందుల్లో ఉన్న వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మంచిదని కొంత మంది విద్యావేత్తలు ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు.  ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ నుంచి ఆర్థిక, సాంకేతిక ఇతర సహకారాలు అందుతూ ఉంటాయి. ప్రభుత్వానికి అప్పగించని ఎయిడెడ్ కాలేజీల సిబ్బందిని వెనక్కి తీసుకుంటున్న ప్రభుత్వం  కేంద్రం నుంచి ఆర్థిక సహకారం యథావిధిగా కొనసాగేలా చూడాలని  ఆయా ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు కోరుతున్నాయి.