టీఎస్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET)- 2021 పరీక్షలో ఉత్తీర్ణులైన ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం లేదని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది. వీరిని కౌన్సెలింగ్‌కు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈసెట్ కౌన్సెలింగ్‌కు ధ్రువపత్రాలు అవసరమని, ఏపీలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం పరీక్షలు ఇప్పటివరకు నిర్వహించని కారణంగా అక్కడి విద్యార్థులకు ఎలాంటి ధ్రువపత్రాలు ఉండవని తెలిపింది. ఈ కారణంతోనే కౌన్సెలింగ్‌కు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. 


పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ సెకండియర్‌లో చేరేందుకు గానూ ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. టీఎస్ ఈసెట్ పరీక్ష ఈ నెల 3న జరిగింది. ఈసెట్ పరీక్షలకు మొత్తం 24,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 23,667 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 22,522 మంది అర్హత సాధించారు. వారిలో 1500 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. 


ఆగస్టు 29 వరకు..
ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 26 నుంచి ప్రారంభం అయింది. ఇది ఆగస్టు 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఏపీలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన విద్యార్థులు మహబూబ్ నగర్‌లోని పాలిటెక్నిక్ కేంద్రంలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయితే వీరిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. 
కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రాసెసింగ్ ఫీజు రూ.1200 చెల్లించామని.. ఇప్పుడు కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 


సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు..
టీఎస్ ఈసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 2వ తేదీన ఉంటుందని చెప్పారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.


సెప్టెంబర్‌ 13 నుంచి తుది విడత.. 
సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. సెప్టెంబర్‌ 14వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. వెబ్ ఆప్షన్లను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఇచ్చుకోవచ్చని సూచించింది. సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబరు 17న ప్రకటిస్తామని వెల్లడించింది. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించింది. స్పాట్ అడ్మిషన్లకు సెప్టెంబర్ 18వ తేదీన అవకాశం కల్పిస్తామని తెలిపింది. మరిన్ని వివరాల కోసం https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


Also Read: AP Schools Reopen: ఏపీ బడుల్లో కరోనా కలవరం.. పదిరోజుల్లో 50 మంది విద్యార్థులకు కరోనా... ఆందోళనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు


Also Read: AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?