Telangana New IT Minister Sridhara Babu: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది అప్పట్లో ఎంత ఫేమస్ అయింతే తెలంగాణ ఐటీ మంత్రి ఎవరు అనేది కూడా ఈ మధ్య కాలంలో అంతే స్థాయిలో ఫేమస్ అయింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఇదే విషయంపై రకరకాలుగా చర్చలు చేశారు. అయితే వారం రోజులుగా సాగుతున్న చర్చకు ఇవాళ పుల్‌స్టాప్ పడింది.
ఊహాగానాలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ మంత్రి బాధ్యతలను దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అప్పగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖలకు మంత్రిగా పని చేసిన అనుభవంతో కీలకమైన ఐటీ శాఖలు ఆయనకు కట్టబెట్టారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
52 ఏళ్ల శ్రీధర్‌బాబు తండ్రి మరణంతో 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి మంథని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 1999 నుంచి విజయం సాదిస్తూ వస్తున్న శ్రీధర్‌బాబు 2004లో విప్‌గా పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, న్యాయశాఖతోపాటు శాసన వ్యవహారాల మంత్రిగా కూడా పని చేశారు.
మంత్రిగా పని చేసిన అనుభవంతోపాటు శ్రీధర్ బాబుకు సన్నిహితులు చాలా మందికి ఐటీ కంపెనీలు ఉన్నాయట ఆ రంగంలో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే అన్నింటినీ బేరీజు వేసుకొని శ్రీధర్‌బాబుకు ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.
సొషల్ మీడియాలో ఒకటే లొల్లి
తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు అన్నదానిపై సోషల్ మీడియాలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం కేటీఆర్ బెస్ట్ ఐటీ మినిస్టర్ అని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడమే. అయితే కేటీఆర్ మాత్రమే కాదని ఆయనకు మించిన బెస్ట్ ఐటీ మినిస్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటారని కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో వీరు అర్హులు అంటూ కొంత మంది పేర్లను తెరపైకి తెచ్చారు.
బెంగళూరు తర్వాత దేశంలోనే హైదరాబాద్ నగరం ఐటీలో అగ్రగామిగా ఉంది. తెలంగాణా ఏర్పడ్డాక రెండు పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ రెండుసార్లూ ఈ శాఖను కేటీఆరే చేపట్టారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన చెప్పుకోదగిన పాత్ర పోషించారు. కొత్త మంత్రివర్గంలో ఐటీ మంత్రి కోసం రెండు పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఒకరు జానారెడ్డి కుమారుడు జైవీర్, ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్ రావు మరొకరు. అయితే వాళ్లిద్దర్లో ఒకరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. అనూహ్యంగా శ్రీధర్‌బాబు తెరపైకి వచ్చారు.
ఇంకా ఏడు ఖాళీలు ఉన్నందున వాళ్లిద్దరి డోర్లు మూసుకుపోలేదనే వాదన కూడా ఉంది. వారికి ఈసారి విస్తరణలో మంత్రివర్గంలో చోటు కల్పించి ఐటీ శాఖ కట్టబెడతారేమో అనే చర్చ ఆగిపోలేదు. నిబంధనల ప్రకారం తెలంగాణా మంత్రిమండలిలో గరిష్ఠంగా 18మందికి చోటు కల్పించాలి. ఇప్పటికే 11 మందికి చోటు కల్పించారు. ఇప్పుడు మిగతా ఏడుగు ఎవరూ అనే చర్చ తీవ్రమైంది.