Deputy CM Bhatti Stated Prajapalana Application Process: రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రంగారెడ్డి (RangaReddy) జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ (Abdullapurrmet)లో 6 గ్యారెంటీలకు సంబంధించి 'ప్రజాపాలన' (Prajapalana) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ప్రజలెవరకూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇది దొరల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వమని అన్నారు. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని, పథకాలు అందిస్తామనే ప్రభుత్వం తమది కాదని చెప్పారు. 'పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మేం ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల సమక్షంలోనే అమలు చేస్తున్నాం. ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి వంద కుటుంబాలకు ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు అందిస్తాం. ప్రతి ఊరిలోనూ కౌంటర్ ఉంటుంది. జనవరి 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.' అని భట్టి వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, హనుమంతరావు, శ్రుతిఓజా, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు.


'పైరవీలకు నో ఛాన్స్'


రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు సంబంధించి అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం నుంచి జనవరి 6 వరకూ 'అభయహస్తం' గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని చెప్పారు. బంజారాహిల్స్ లోని 'ప్రజాపాలన' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్ లో 600 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.


5 పథకాలకు ఒకే అర్జీ


'ప్రజాపాలన' దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఇందులో 4 పేజీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు. అర్హులు ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పథకానికి అర్హులైన వారు అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఒకవేళ, అన్ని పథకాలకు అర్హులైతే, ఒకే దరఖాస్తులు అన్ని వివరాలు నింపాలి. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఫోటో ఇవ్వాలి.


అప్లై ఇలా



  • దరఖాస్తు తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, రేషన్ కార్డు సంఖ్య, మొబైల్ నెంబర్, వృత్తితో పాటు సామాజిక వర్గం వివరాలు నింపాలి. దరఖాస్తుదారుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్ చేయాలి. కింద కుటుంబ సభ్యుల పేర్లు, వారు పుట్టిన తేదీలు, వారి ఆధార్ నెంబర్లు, తర్వాత దరఖాస్తుదారు చిరుమానా రాయాలి.

  • అనంతరం 5 పథకాలకు సంబంధించిన వివరాలుంటాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం దగ్గర టిక్ చేయడం సహా వివరాలు నింపాలి.

  • 'మహాలక్ష్మి' రూ.2,500 ఆర్థిక సహాయం పొందాలంటే అక్కడ కాలమ్ లో టిక్ చేయాలి. ఇదే పథకంలో భాగమైన రూ.500కు గ్యాస్ సిలిండర్ లబ్ధి కోసం గ్యాస్ కనెక్షన్ సంఖ్య, సిలిండర్ సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ పేరు, ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు.? అనే వివరాలు నింపాలి.

  • 'రైతు భరోసా' పథకానికి సంబంధించి లబ్ధి పొందాలనుకుంటే వ్యక్తి రైతా.? కౌలు రైతా.? అనేది టిక్ పెట్టాలి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు, సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం లెక్కలు రాయాలి. ఒకవేళ దరఖాస్తుదారు వ్యవసాయ కూలీ అయితే, ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయాలి.

  • 'ఇందిరమ్మ ఇళ్లు' పథకానికి సంబంధించి ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్సులో టిక్ పెట్టాలి. అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతో పాటు, అమరుడి పేరు, ఆయన మృతి చెందిన సంవత్సరం, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికెట్ నెంబర్ వివరాలు రాయాలి. తెలంగాణ ఉద్యమకారులైతే ఎదుర్కొన్న కేసుల ఎఫ్ఐఆర్, సంవత్సరం, జైలుకెళ్తే ఆ సంవత్సరం, జైలు పేరు, శిక్షాకాలం వివరాలు అందించాలి.

  • 'గృహజ్యోతి' పథకం కింద కుటుంబానికి ప్రతి నెలా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం కింద లబ్ధి పొందాలంటే, దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్ వినియోగం వాడకం వివరాలు నింపాలి. ఇందులో 0-100 యూనిట్లు, 100-200 యూనిట్లు, 200 యూనిట్ల పైన ఈ మూడింటిలో ఒకదాని ఎదురుగా టిక్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య రాయాలి.

  • 'చేయూత' పథకం కింద కొత్తగా పింఛన్ కోరుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇప్పటికే పింఛన్ అందుకుంటున్న వారు అప్లై చేయాల్సిన అవసరం లేదు. దివ్యాంగులైతే సంబంధిత బాక్సులో టిక్ చేసి సదరం సర్టిఫికెట్ సంఖ్య రాయాలి. ఇతరుల్లో.. వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, పైలేరియా బాధితులు ఎవరైతే వారికి సంబంధించిన బాక్సులో టిక్ చేయాలి.


రశీదు జాగ్రత్త


చివరి పేజీలో దరఖాస్తుదారు సంతకం లేదా వేలిముద్రతో పాటు పేరు, తేదీ రాయాలి. నింపిన దరఖాస్తు ఫారాన్ని గ్రామసభ, వార్డు సభల్లో సమర్పించాలి. దరఖాస్తు ఆఖరి పేజీలో కింది భాగంలో 'ప్రజాపాలన' దరఖాస్తు రశీదు ఉంటుంది. దరఖాస్తుదారు పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాల బాక్సులో టిక్ చేసి, సంబంధిత అధికారి సంతకం చేసి రశీదు ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది.


Also Read: Telangana Rajyasabha Elections : తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్టులు ఖాయమే - ఒక్క స్థానం కోసం ఫిరాయింపులు తప్పవా ?