Telangana Cabinet Ministers : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రభుత్వం పేరుతో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అశేష జనవాహిని మధ్య ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి( Revanth Reddy )...ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా పదకొండు మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు.


మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో అత్యంత ధనవంతులెవరు ? పూర్ మినిస్టర్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే అందరూ ఊహించినట్టుగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధనవంతుడిగా ఉన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తి  461కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆస్తి 39.5 5కోట్లు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు. 


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తర్వాత మూడో స్థానంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయిన ఆయన  ఆస్తి 17.88 కోట్లు. నాలుగో స్థానంలో పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా  హుస్నాబాద్ నుంచి గెలుపొందిన పొన్నంకు 11.83 కోట్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిర నుంచి ఎన్నికైన భట్టి విక్రమార్కకు 8.12 కోట్ల ఆస్తులు ఉంటే, కరీంనగర్ జిల్లా మంథని నుంచి విజయం సాధించిన శ్రీధర్ బాబుకు 6.91 కోట్లు ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి గెలిచిన మంత్రి కొండా సురేఖ తనకు 5.9కోట్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో ప్రకటించారు. హుజూర్‌ నగర్ నుంచి నాలుగోసారి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి రూ.5.82 కోట్ల ఆస్తులున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దామోదర రాజనర్సింహకు 4.6 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడించారు. కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు 2.5 కోట్లు ఉన్నట్టు తన అఫిడవిట్‌లో వివరించారు. ములుగు నుంచి గెలిచిన సీతక్కకు కేవలం 82 లక్షల ఆస్తులతో పాటు ఇంటికి తీసుకున్న రుణం రూ.24.74 లక్షలు ఉన్నట్లు తెలిపారు. 


సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూ.10లక్షల వరకు పెంపు హామీలను సోనియా పుట్టిన రోజు సందర్భంగా అమల్లోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ రెండు గ్యారంటీలపై ఆయా శాఖల అధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా సాగుకు 24 గంటల కరెంటు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు.