BJP MP says Live-in relationship dangerous: లోక్‌సభ సమావేశాల్లో బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ (BJP MP Dharambir Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. సహజీవనం (live-in relationship) పై కొత్త డిమాండ్ లేవనెత్తారు. సహజీవనం ప్రమాదకరమై వ్యాధి అంటూ విమర్శించారాయన. దేశంలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రేమ వివాహాలను కూడా ఆయన తప్పుబట్టారు. ప్రేమ పెళ్లిలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్
హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, లోక్‌సభ సభ్యుడు ధరంబీర్ సింగ్.. ఇవాళ (గురువారం) లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు. దేశంలో ప్రేమ వివాహాలు పెరగడం వల్ల విడాకుల కేసులు కూడా పెరిగాయని అన్నారు. అంతేకాదు... లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ల కారణంగా దేశ సంస్కృతి నాశనం అవుతోందని ఆరోపించారాయన. దేశంలో కొత్త వ్యాధి పుట్టుకొచ్చిందని... ఈ సామాజిక దురాచారాన్ని లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని పిలుస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ ధరంబీర్. ఇద్దరు వ్యక్తులు.. పురుషుడు లేదా స్త్రీ వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నారని చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి సంబంధాలు చాలా సాధారణమని, అయితే ఈ చెడు సంస్కృతి మన సమాజంలో కూడా వేగంగా వ్యాపిస్తోందని విమర్శించారు. దీని వల్ల చెడే తప్ప మంచిజరిగే సూచనలు లేవన్నారు. ఇలాంటి సంబంధాల వల్ల ఘోరాలు జరుగుతాయన్నారు. సహజీవనంలో ఉన్న శ్రద్ధా వాకర్(Shraddha Walker)ను... అఫ్తాబ్(Aftab) దారుణంగా హత్య చేసిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. అందుకే... ప్రమాదకరమైన ఈ వ్యాధిని సమాజం నుంచి నిర్మూలించేందుకు సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం చేయాలని సంబంధిత శాఖ మంత్రిని ఆయన అభ్యర్థించారు.
అలాగే ప్రేమ పెళ్లిళ్ల పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. భారతీయ సమాజంలో సంప్రదాయబద్ధంగా కుటుంబాల ద్వారా వివాహాలు జరుగుతాయని, ఇందులో అబ్బాయి, అమ్మాయిల అంగీకారం కూడా ఉంటుందన్నారు. కానీ... కొన్నేళ్లుగా అమెరికా, పాశ్చాత్య దేశాల్లో విడాకుల కేసులు పెరిగిపోయాయని, దీనికి ప్రేమ వివాహాలే ప్రధాన కారణమని చెప్పారు. ప్రేమ పెళ్లిలు, సహజీవనాల వంటి సంబంధాల వల్ల... జంటల మధ్య గొడవలు పెరిగి ఇరువైపులా కుటుంబాలు నాశనమవుతాయని అన్నారు బీజేపీ ఎంపీ. కనుక.. ప్రేమ వివాహాల విషయంలో ఇరువర్గాలు.. అంటే అబ్బాయి, అమ్మాయి తరపు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పాశ్చాత్య దేశాల మాదిరిగానే.. భారతదేశంలో కూడా సహజీవన సంసృతి పెరిగిపోతుందని, సామాజిక దురాచారాలు పెచ్చుమీరుతాయని హెచ్చరించారు. ఇదే జరిగితే.. భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందన్నారు బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్.
ప్రేమ వివాహాలు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వంటి కొత్త వ్యాధుల వల్ల భారత దేశ సంస్కృతి (Indian culture) నాశనమైపోతోందని అన్నారు బీజేపీ ఈఎం. సహజీవనం సంస్కృతి పెరిగిపోతే... మనకు తెలిసిన నాగరికత, సంస్కృతి ఏదో ఒకరోజు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీన్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్.