Revanth Reddy first Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం అయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నేడు కొత్తగా ప్రమాణం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా 11 మంది మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై భేటీలో చర్చించినట్లు తెలిసింది. హాట్ హాట్ గా సాగిన తొలి క్యాబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ రంగంపై సీరియస్ గా రివ్యూ జరిగింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు.
రేపు ఉదయం విద్యుత్ శాఖపై సీఎం ప్రత్యేక సమీక్ష
విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నాయని విద్యుత్ అధికారులు సీఎంకు చెప్పారు. చివరికి ఆ సమావేశానికి సీఎండీ ప్రభాకర్ రావును కూడా తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన మూడు రోజుల క్రితమే రాజీనామా చేయగా.. ఆమోదించొద్దని ఆదేశించారు. కచ్చితంగా రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులను ఆదేశించారు. గత పదేళ్ల కింద చేసిన ప్రతి ఖర్చు మీద శ్వేత పత్రం రూపొందించే పని మీద దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. ఆరు గ్యారంటీల్లో మొదటి రెండు గ్యారంటీలను ఈ నెల 9 నుంచి అమలు చేయడానికి కేబినెట్ ఆమోదించింది.