వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ( Telugudesam Party) వ్యూహాలు రచిస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu )...పవన్ కల్యాణ్ తో కలిసి ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారు. వీలయినన్ని ఎక్కువ బహిరంగ సభలు నిర్వహించి, జనాన్ని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్ లతో ఎన్నికల వేడిని రగిలించనున్నారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం సాగుతుండటంతో...అంతకంటే ముందే అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు రెడీ అయ్యారు. లోక్ సభ స్థానాల వారీగా బహిరంగ సభలకు రెడీ అయ్యారు. ఈ బహిరంగ సభలతోనే ప్రజలను ఆకర్షించి, తమ వైపు తిప్పుకునేలా ఎత్తులు వేస్తున్నారు. జనవరి(January) లోనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పార్టీ నేతలతో పాటు శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే అధికార పార్టీ నుంచి వలసలు పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. జిల్లాల వారీగా సమీక్ష చేసిన చంద్రబాబు...కొందర్ని ఫైనల్ చేశారు. మరికొందర్ని త్వరలోనే ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. 


జనవరి 5నుంచి చంద్రబాబు బహిరంగసభలు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  బహిరంగ సభల షెడ్యూల్ విడుదలైంది. జనవరి  5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వరుసగా సభలు జరగనున్నాయి. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రతి బహిరంగసభకు లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జనవరి 5న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బహిరంగ సభ జరగనుంది. జనవరి 7న ఆచంట, తిరువూరులో, 9న వెంకటగిరి, ఆళగడ్డ బహిరంగ సభలు జరగనున్నాయి. 10న పెద్దాపురం, టెక్కలిలో జరిగే బహిరంగసభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. జనవరి 5వ తేదీ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. వచ్చే నెల 25న అన్ని పార్లమెంట్ స్థానాల్లో బహిరంగసభలు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తోంది టీడీపీ. 


సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తాం


మరోవైపు కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడారు. గుడుపల్లి నాకు గుండె లాంటిదన్న ఆయన, కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ భాగంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామన్నారు. నిరుద్యోగులకు నెలకు 3వేలు ఇస్తామని, యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదన్నారు. వంద రోజులు తన కోసం, మీ కోసం పని చేయాలని ప్రజలు, తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు, ప్రజల జీవితాలను మార్చే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటాయని హామీ ఇచ్చారు.  వైసీపీకి వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని,  ఆ పార్టీ సినిమా అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు. ప్రతి ఇంటికి రెండు ఆవులు ఉంటే మంచిదని ఎప్పుడో చెప్పానన్న చంద్రబాబు, అపుడు తనను ఎగతాలి చేశారని విమర్శించారు. పాడిని పరిశ్రమగా తయారు చేసి ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తానన్నారు.