Tamil Nadu Politics:


ఉప్పు నిప్పులా..


తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. AIDMK,BJP కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలంతా AIDMKకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదిరింది. పొత్తు ధర్మాన్ని మరిచిపోయి ఏఐడీఎమ్‌కే కుట్ర చేస్తోందంటూ  బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. పళని స్వామి దిష్టిబొమ్మల్ని తగల బెడుతూ నిరసన వ్యక్తం చేస్తోంది. గత వారం ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదురుతూ వస్తోంది. వీరిలో బీజేపీ ఐటీ వింగ్ చీఫ్ సీఆర్‌టీ నిర్మల్ కుమార్ కూడా ఉండటం కలకలం రేపింది. ఆ తరవాత ఒకేసారి 13 మంది బీజేపీ నేతలు పార్టీ వీడటం రాజకీయాలను మరో మలుపు తిప్పింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై..డీఎంకేతో అంటకాగుతున్నారని ఆరోపిస్తున్నారు బయటకొచ్చిన నేతలు. 2019లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాయి. దాదాపు మూడు ఎన్నికల్లో కలిసే పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఇటీవల జరిగిన ఓ ఉప ఎన్నికలోనూ AIDMK ఓడిపోయింది. అప్పటికే రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఆ ఉప ఎన్నిక ప్రచారంలో కలిసి ప్రచారం కూడా చేయలేదు. బీజేపీ కారణంగానే తాము ఓడిపోతున్నామని అన్నా డీఎంకే భావిస్తోంది. క్యాడర్ లేని పార్టీతో పొత్తు ఎందుకు అన్న పునరాలోచనలో పడింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమిళనాడు పర్యటనకు వచ్చారు. అప్పుడు కూడా అన్నా డీఎంకే చీఫ్ పళని స్వామి అమిత్‌షాను కలిసేందుకు వెళ్లలేదు. కలిసే అవసరం తనకు లేదంటూ బహిరంగంగానే అన్నారు. 


వాదోపవాదాలు..


ప్రస్తుత పరిణామాలపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై అన్నా డీఎంకే భయపడుతోందని విమర్శించారు. ప్రస్తుతం తమ పార్టీ క్యాడర్ పెరుగుతోందనటానికి ఇదే నిదర్శనం అని తేల్చి చెప్పారు. జయలలిత, కరుణానిధి మాదిరిగానే తానూ ఓ లీడర్‌నని, మేనేజర్‌ను కాదని తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అన్నమలై. అసలు రాష్ట్రంలో పెద్దగా క్యాడర్ లేని  పార్టీ నేతల్ని మేమెందుకు లాగేసుకుంటాం అంటూ అన్నాడీఎంకే సెటైర్లు వేస్తోంది. అసలు ఈ వివాదం అంతా మొదలవ్వడానికి కారణం బీజేపీయే అన్న వాదన వినిపిస్తోంది. 234 సీట్లున్న తమిళనాడులో బీజేపీకి ఉన్నది నాలుగు స్థానాలు మాత్రమే. కానీ...అన్నాడీఎంకేను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్టుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇది కాస్తా AIDMKకి అసహనం పెంచింది. అప్పటి నుంచి క్రమంగా బీజేపీకి దూరం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ నేతలంగా అన్నాడీఎంకేలో చేరుతుండటం పొలిటికల్ హీట్‌ను మరో స్థాయికి చేర్చింది. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య అన్నాడీఎంకే పగ్గాలపై చాన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఇద్దరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతుండటం మరో సంచలనమైంది. 


Also Read: భారత్ చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం తప్పదు - యూఎస్ ఇంటిలిజెన్స్