ఒక వ్యక్తి ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకొని కాపురాలు చేయడం గతంలో అక్కడక్కడా కనిపించినప్పటికీ ప్రస్తుతం చాలా తగ్గింది. చాలా సినిమాల్లో కూడా ఒకరికి ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా చూపించారు. నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలా ఇద్దర్ని పెళ్లి చేసుకోవడం నేరం అయినప్పటికీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టేందుకు రెడీ అయ్యాడు. ఆ పెళ్లికి ఏకంగా శుభలేఖలు కూడా అచ్చు వేయించాడు. అందులో వధువులు ఇద్దరు ఉండడం చూసిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతను ఇద్దరు అమ్మాయిల పెద్దల్ని ఒప్పించి మరీ ఆ పెళ్లి చేసుకుంటుండడం విశేషం. ఈ కాలంలోనూ ఇలాంటి వారు ఉన్నారా అని ఆ శుభలేఖ చూసిన వారు చర్చించుకుంటున్నారు. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఇద్దరి మెడలో తాళి కట్టనున్నాడు యువకుడు. అంతేకాదు పెళ్లి పత్రికలు కూడా అందరికి పంచేశాడు. ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఆ యువకుడు ప్రేమించాడని, అంతేకాకుండా చాలా కాలంగా కాపురం కూడా చేస్తూ ఉన్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించి అందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన ముత్తయ్య, రామలక్ష్మి రెండో కొడుకు సత్తిబాబు. వీరి గిరిజన సంప్రదాయాలు అందరితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. గిరిజన కులాల్లోని యువతి, యువకులు ఒకరిని ఒకరు ఇష్టపడితే ముందుగానే సహజీవనం చేస్తారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. సహజీవనం చేస్తున్న క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు. అయితే సహజీవనం చేసినందుకు కుల పెద్దలకు, గ్రామస్థులకు కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది.


సత్తిబాబు ఇంటర్ చదువుతున్న సమయంలో పక్క గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న స్వప్న కుమారిని ప్రేమించాడు. అదే సమయంలో వరసకు మరదలైన సునీతను కూడా ఇష్టపడ్డాడు. గత మూడేళ్ల నుంచి ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్న కుమారికి ఒక పాప జన్మించింది. సునీతకు కూడా సత్తిబాబు వల్లే ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం మళ్లీ ఇద్దరూ గర్భం దాల్చారు. దీంతో ఆ అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును కోరగా ఇద్దరిని ప్రేమిస్తున్నానని, కాబట్టి ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 


ఈ విషయం గ్రామ పెద్దల వరకూ వెళ్లింది. పంచాయితీలో ముగ్గురి ఇష్టఇష్టాలను అడిగి తెలుసుకుని ముగ్గురి పెళ్లికి ఓకే చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరితో ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కూడా అచ్చు వేయించారు. వాటిని బంధువులందరికీ పంచారు. ఇక బంధువులందరిని పిలిచి పందిరి ముహూర్తం, పెళ్లి ముహూర్తం వేరుగా పెట్టారు. పెళ్లి పనులు కూడా ప్రారంభించారు. గురువారం ఉదయం ఏడు గంటలకు బ్రాహ్మణులు లేకుండా కులపెద్దలు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరికీ ఒకే ముహూర్తానికి తాళి కట్టడానికి రెడీ అయ్యాడు.