తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో కామన్ మ్యాన్ సీఎంగా పేరు తెచ్చుకున్న స్టాలిన్.. ఈరోజు మరోసారి అలాంటి పనే చేశారు. చెన్నైలో వేగంగా దూసుకుపోతోన్న స్టాలిన్ కాన్యాయ్ ఒక్కసారిగా ఆగింది. వెంటనే కారు దిగిన స్టాలిన్ దూరంగా ప్లకార్డ్ పట్టుకొని నిల్చొన్న ఓ విద్యార్థి దగ్గరికి వెళ్లి స్యయంగా మాట్లాడారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ వ్యక్తి ఓ తెలుగువాడు. అవును..






ఇదీ జరిగింది..


చెన్నైలో సీఎం స్టాలిన్‌ కాన్వాయ్‌ వెళ్తోన్న మార్గంలో 'సీఎం సర్‌ హెల్ప్‌మీ' అనే బోర్డు పట్టుకుని ఓ విద్యార్థి నిల్చున్నాడు. ఇది చూసిన స్టాలిన్‌ వెంటనే కారు ఆపించారు. విద్యార్థి దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు.


తాను ఆంధ్రా నుంచి వచ్చానని.. నీట్‌ ద్వారా మెడిసిన్‌ సీటు రాలేదని ఆ వ్యక్తి మొర పెట్టుకున్నాడు. తనకు ఎలాగైనా సీటు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు. ఇది విన్న సీఎం స్టాలిన్.. విద్యార్థితో ఆప్యాయంగా మాట్లాడారు.


ఆంధ్రాలో ఎక్కడి నుంచి వచ్చారని అడిగి తెలసుకున్న స్టాలిన్‌, తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నీట్‌ ఒక్క తమిళనాడు సమస్యే కాదని.. దీనిపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నామని స్టాలిన్ హామీ ఇచ్చారు.


తూర్పుగోదావరి వాసి..


సీఎం కాన్వాయ్ ఆపిన స్టూడెంట్ పేరు సతీష్. తూర్పు గోదావరి జిల్లా వాసి అని తెలిసింది. ప్రజల ముఖ్యమంత్రిగా పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు స్టాలిన్‌. గతంలో ఒకసారి ఓ ట్రాఫిక్‌ కూడలి దగ్గర నిరీక్షిస్తున్న వృద్ధ మహిళను చూసి కాన్వాయ్‌ ఆపి ఆమె దగ్గర మెమొరాండం అందుకున్నారు.


చెన్నై వరదల సమయంలోనూ ఎంతోమంది బాధితులను నేరుగా వెళ్లి పలకరించారు స్టాలిన్. రాజకీయాల విషయంలోనూ స్టాలిన్ తనదైన మార్కు చూపిస్తున్నారు. అమ్మ క్యాంటిన్లు కొనసాగించడం సహా కీలక అంశాల్లో ప్రతిపక్ష నేతల వాణిని కూడా వింటున్నారు. తమిళనాడులో అమ్మలేని లోటును పూడ్చడానికి స్టాలిన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.


Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'


Also Read: UP Election 2022: యోగిపై ఈసీకి సమాజ్‌వాదీ ఫిర్యాదు.. సీఎం భాషపై అభ్యంతరం