Swiggy Strike: 


చెన్నైలో సమ్మె


ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక అందరూ నచ్చని డిష్‌లను ఇంటికే తెప్పించుకుంటున్నారు. వండేందుకు వీల్లేకపోయినా...బద్ధకంగా ఉన్నా సింపుల్‌గా ఆర్డర్ చేసుకుని ఆకలి తీర్చేసుకుంటున్నారు. ఓ ఐదేళ్లుగా ఈ బిజినెస్‌ బాగా రన్ అవుతోంది. డిమాండ్ కూడా బానే పెరుగుతోంది. ఫలితంగా...ఫుడ్ డెలివరీ సంస్థలు వీలైనంత ఎక్కువ డెలివరీ బాయ్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నాయి. కొంత మంది యువకులకు ఇలా 
ఉపాధి దొరుకుతోంది. అయితే...ఈ మధ్య కాలంలో వీరిని సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కొందరు కంపెనీకి వ్యతిరేకంగా స్ట్రైక్ చేశారు. ఇప్పుడు చెన్నైలోనూ ఇదే జరుగుతోంది. స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ సమ్మెకు దిగారు. పేమెంట్ విధానంలో మార్పులు తీసుకురావాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు మూడు రోజులుగా చెన్నైలో ఈ సమ్మె కొనసాగుతోంది. ఈ కారణంగా...సిటీ అంతా స్విగ్గీ డెలివరీలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి దాదాపు 800 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. పని గంటల్ని విపరీతంగా పెంచటమే కాకుండా, ఇన్‌సెంటివ్స్‌లో కోత పెట్టారని ఆరోపిస్తున్నారు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు. "ప్రతి వారం 10 గంటలు పని చేసే వాడిని. రూ.12,000 చేతికి వచ్చేవి. కానీ...ఇప్పుడా పని గంటల్ని 15-16 వరకూ పెంచారు. అంత కష్టపడినా చేతికి వచ్చేది రూ.13,500 మాత్రమే" అని ఓ డెలివరీ బాయ్ అసహనం వ్యక్తం చేశాడు. శాలరీ పెంచకుండా...పని గంటలు మాత్రం పెంచేశారని అంటున్నారు. 


కొత్త నిబంధనలు..


కొత్త రూల్స్ ప్రకారం...ఒక్కో డెలివరీ బాయ్ వారానికి రూ.13,500 సంపాదించాలంటే కనీసం 180 డెలివరీలు చేయాలి. ఇక పార్ట్‌టైమ్ వర్కర్స్ అయితే వారానికి 60 డెలివరీలు చేస్తే రూ.3,000 ఇస్తారు. అయితే..రోజుకు కనీసం 30 డెలివరీలు చేయాలని కంపెనీ ఒత్తిడి తెస్తోందని చెబుతున్నారు డెలివరీ బాయ్స్. రోజుకు వాళ్లిచ్చే రూ.400 కోసం 300 కిలోమీటర్ల వరకూ బైక్‌పై తిరగాల్సి వస్తోందని అంటున్నారు. పెట్రోల్‌ ఛార్జీలు పోగా మిగిలేదేమీ ఉండదన్నది వాళ్ల వాదన. అందుకే..ఇలా సమ్మెకు దిగారు. ఈ కారణంగా..చెన్నై సిటీలో ఆన్‌లైన్ ఆర్డర్లు దాదాపు 70% వరకూ తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా స్విగ్గీ వర్కర్లకు జీతాలు పెంచారని, తమకు ఎందుకు పెంచటం లేదని ప్రశ్నిస్తున్నారు. అటు స్విగ్గీ మాత్రం వీరి వాదనల్ని కొట్టి పారేస్తోంది. పని గంటల్లో, పేమెంట్ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేస్తోంది.


మార్పు ఇందుకేనా? 


రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు ఆయా సంస్థలు 5 శాతం పన్ను విధిస్తున్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్‌ చేసినప్పుడు పన్ను ఎగవేత జరుగుతోందని కేంద్రం గుర్తించింది. రెండేళ్లలో దాదాపు రూ.2వేల కోట్లు నష్టపోయినట్టు తెలుసుకొంది. దీంతో పన్ను ఆదాయం తగ్గుతోందని భావించి ఫుడ్‌ అగ్రిగేటర్లే ఇకపై తమకు వచ్చే ఆర్డర్లపై పన్ను చెల్లించాలని ఆదేశించింది. అంటే రెస్టారెంట్లు సొమ్ము చేసుకుంటున్న పన్నును వారి నుంచి వసూలు చేసి స్విగ్గీ, జొమాటోయే కేంద్రానికి చెల్లించాలన్నమాట. ఈ లావాదేవీలో వినియోగదారుడిపై ఎలాంటి అదనపు భారం మోపడం లేదు. కాబట్టి ఎప్పట్లాగే మీకు ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకొని లాగించొచ్చు. బహుశా పేమెంట్ విధానంలో మార్పులు చేర్పులు చేయటానికి ఇదీ ఓ కారణమై ఉంటుందని కొందరు భావిస్తున్నారు. 


Also Read: Lalu Prasad VS BJP: 'త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తాం- 2024లో భాజపాను గద్దె దించుతాం'