బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఉపఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రఎన్నికల సంఘం నిర్ణయించింది. రాజకీయ పార్టీల మధ్య యుద్ధం స్థాయిలో ఇప్పటికే ప్రచారం జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక కూడా వాయిదా పడింది. ఏపీలో జరగాల్సిన బద్వేలు అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నికను కూడా వాయిదా వేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.


బెంగాల్, ఒడిషా మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఉపఎన్నికలు వాయిదా..!


కేంద్ర ఎన్నికలసంఘం ఉపఎన్నికల నిర్వహణ అంశంపై ఇటీవల అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నికలు ఇప్పుడే వద్దని సూచించింది. కరోనా, పండగ సమయం ఇలా రకరకాల కారణాల వల్ల వాయిదా వేయాలని కోరింది. ఏపీ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. దీంతో హుజురాబాద్,  బద్వేలు ఉపఎన్నికలను పండగ సీజన్ అయిపోయే వరకూ వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వాలే కోరడంతో ఎన్నికల సంఘం భిన్నమైన నిర్ణయం తీసుకోలేదు.


Also Read : సినిమా చూపించడంలో డీజీపీ సవాంగ్ ఆర్జీవీని మించిపోయారట


పండగ సీజన్ అయిపోయిన తర్వాతనే హుజురాబాద్ ఉపఎన్నిక..!


హుజురాబాద్ ఉపఎన్నికలు నేడో రేపో అన్నట్లుగా పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే అనూహ్యంగా పండగ సీజన్ అయిపోయిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ కోరడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.  పండగ సీజన్ అంటే... ఇక సంక్రాంతి వరకూ ఏదో ఓ పండుగ వస్తూనే ఉంటుంది. ఎన్నికలు ఇక  జనవరి తర్వాతే జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు వాయిదా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరో మూడు, నాలుగు నెలల వరకూ రివ్యూ చేసే అవకాశం లేదు. అందుకే హుజురాబాద్ ఉపఎన్నిక కూడా ఇప్పుడల్లా జరిగే అవకాశం లేదని అనుకోవచ్చు.


Also Read : సింగల్ మొగులయ్యకు పవన్ కల్యాణ్ చేసిన సాయం ఎంతో తెలుసా..?


మమతా బెనర్జీకి రిలీఫ్.. భవానీపూర్ ఉపఎన్నికలకు షెడ్యూల్ ..!


ఒడిషా ప్రభుత్వంతో పాటు బెంగాల్ సర్కార్ కూడా తమ రాష్ట్రాల్లో కోవిడ్ పూర్తిగా కంట్రోల్‌లో ఉందని ఉపఎన్నికలు పెట్టాలని కోరాయి.  అలాగే వరదల ప్రభావం  కూడా ఉపఎన్నికలు జరిగే ప్రాంతాలపై ఉండదని స్పష్టం చేశాయి. అదే సమయంలో బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేకమైన కారణాలను చెప్పింది. తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరు నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కాకపోతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపఎన్నికలు నిర్వహించాలని కోరింది.  బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు  భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఒడిషాలోని అసెంబ్లీ సీటు ఉపఎన్నికను కూడా నిర్వహిస్తారు. ఈ నెల ఆరో తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వచ్చే నెల మూడో తేదీన కౌంటింగ్ జరుగుతుంది.