ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాన్సిచ్చారు. ఆయనే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. ఆయనపై వైసీపీ తరపున పోటీ చేసిన గుంతోటి వెంకట సుబ్బయ్య 44వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన వెంకట సుబ్బయ్య గత మార్చి 26న కన్నుమూశారు. ఈ కారణంగా ఉపఎన్నిక అని వార్యమయింది. నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోపు ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో ఆలస్యం అయింది. ఇంకా షెడ్యూల్ రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత లేదు. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థిని ఖరారు చేశారు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు రాని పెట్టుబడిదారులు
వైసీపీ తరపున ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. వైసీపీ తరుపున దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధకే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఉపఎన్నికలు కాబట్టి అక్కడ అభివృద్ధి పనులకు సీఎం జగన్ నిధులు మంజూరు చేస్తున్నారు. పలు అభివృద్ధిపనులకు గతంలోనే శంకుస్తాపన చేశారు. తాజాగా బద్వేలును రెవిన్యూ డివిజన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం వచ్చినా తమ ప్రాంతానికి ఏమీ జరగలేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఏర్పడకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read : డ్రగ్స్ కేసులో పూనం కౌర్‌కు తెలిసిన సీక్రెట్స్ ఏంటి..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లా కంచుకోట లాంటిది. బద్వేలు నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో టీడీపీ గెలవలేదు. రిజర్వుడు నియోజకవర్గం కాక ముందు టీడీపీకి ప్రధాన నేతగా బిజివేముల వీరారెడ్డి ఉండేవారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి మారింది. ఆయన మరణంతో 2001లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె విజయమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో ఆమె పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడు కేటగిరిలోకి వెళ్లింది. అయినప్పటికీ పార్టీ బాధ్యతలు ఆమే చూసుకుంటూ వచ్చారు. ఆ కుటుంబం చెప్పిన వారికే టిక్కెట్ ఇస్తూ వచ్చారు. అయితే రెండేళ్లుగా ఆమె పెద్దగా రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు. దీంతో బద్వేలు టీడీపీలో పరిస్థితి స్తబ్దుగా మారింది.
Also Read : 2 కేజీల బంగారం కొట్టేసి..దాచుకోలేక దొరికిపోయాడు..!
విజయమ్మ ఆశీస్సులతోనే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆయనకు పార్టీపై ఉన్న పట్టు తక్కువ. ఈ సారి కూడా అభ్యర్థిని ఖరారు చేసే సమావేశాలకు విజయమ్మ రాలేదు. కానీ చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి తన అంగీకారం తెలిపారు. దీంతో టీడీపీ అధినేత అభ్యర్థిని ఖరారు చేశారు. మరో వైపు పొత్తులో ఉన్న బీజేపీ,, జనసేన ఈ ఉపఎన్నిక గురించి ఆలోచించడం లేదు. గతంలో తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఆసక్తి చూపే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే బద్వేలులో ఎవరెవరు పోటీ చేస్తారన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.