జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కళాశాల ప్రిన్సిపాల్ ఖాతాల్లో జమచేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరఫున హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఖాతాల్లో జమచేయాలని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా దీవెన సొమ్ము మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. జగనన్న విద్యా దీవెన డబ్బు విద్యార్థులు తల్లుల అకౌంట్లలో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించాలని తెలిపింది.
Also Read: KBC KTR Twitter: KBCలో కేటీఆర్ ట్వీట్.. ఇంతకీ సవాల్‌కు దాదా, సెహ్వాగ్ ఆన్సర్ చేశారా?
జీవో 28 రద్దు
అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఇకపై విద్యార్థుల తరఫున సొమ్మును కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని హైకోర్టు రద్దు చేసింది. జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన సొమ్మును కాలేజిలకు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని సూచించింది. కళాశాలలు విద్యార్థుల నుంచి బోధన రుసుము వసూలు చేసుకోవచ్చని తెలిపింది. త్రైమాసికానికి ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన సొమ్మును 40% మంది కళాశాలలకు చెల్లించలేదని హైకోర్టు గుర్తుచేసింది.
చదువుకు ఆటంకం రాదు
లోపాలుంటే కళాశాలలపై ఫిర్యాదు చేసే హక్కును తల్లిదండ్రులకు ఇచ్చారని హైకోర్టు వెల్లడించింది. తల్లు బోధన రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అంశంపై జీవో పేర్కొనలేదని ఆక్షేపించింది. కాలేజిల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తే విద్యార్థుల చదువుకు ఆటంకం వచ్చే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. అందువల్ల తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము జమ చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవోలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఈ మేరకు తీర్పు వెలువరించారు.
Also Read: Mansas Trust: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా ఎవరిని నియమించినా పర్లేదు...కానీ