ఎన్నికల కేసులు, ప్రజల కోసం చేసిన ఆందోళనలు మినహా తనపై దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారం, డెకాయిట్ కేసులు ఉంటే చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సూచించారు. " చింతమనేని ప్రభాకర్‌పై 84 కేసులు ఉన్నాయని అలాంటి వారిని ఎలా కట్టడి చేయాలో ప్రజలే ఆలోచించాలంటూ " శుక్రవారం ప్రెస్‌మీట్‌లో గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా పోలీసు శాఖ ఉపయోగించే ఎంటర్‌ప్రైజెస్ సెర్చ్‌లో చింతమనేని ప్రభాకర్ పేరు కొట్టి కేసుల జాబితాను బయటకు తీశారు. అదే సమయంలో వనజాక్షి కేసు విషయంలో రాజకీయపరమైన విమర్శలు కూడా చేశారు. డీజీపీ తనపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు చింతమనేని ప్రభాకర్ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు.  



Also Read : శ్రీవారి నిధులు దేవాదాయశాఖకు మళ్లింపు


ఎంటర్‌ప్రైజెస్ సెర్చ్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరును కొడితే 36 కేసులు వస్తాయని చింతమనేని వ్యాఖ్యానించారు.  తనపై కేసుల విషయంలో డీజీపీ తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. మొత్తంగా 84 కేసులు ఉన్నాయన్న డీజీపీ  ప్రస్తుతం వాటిలో ఎన్ని న్యాయస్థానాల్లో కొట్టి వేశారో... ఎన్ని ఎన్నికల కేసులో.. .ఎన్ని సీరియస్ కేసులో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పనులు జరగడం లేదని ప్రశ్నించేందుకు వెళ్లినా కేసులు పెట్టారని గుర్తు చేశారు. తనపై ఉన్న కేసులన్నీ ప్రజల కోసం పోరాడినవేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా చేసిన నేరాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. దోపిడీలు, దొంగతనాలు, అవినీతి కేసులు  ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజల కోసం చేసిన పోరాటంలోనే తనపై రాజకీయ కుట్ర పన్ని కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రతీ దాంట్లోనూ అట్రాసిటీ కేసులు పెట్టారని విమర్శించారు. 


Also Read : తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు ఎందుకు రావడం లేదు ?


వనజాక్షి కేసు విషయంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలను చింతమనేని ఖండించారు. ఆ నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే ఇప్పుడు డీజీపీ హోదాలో సవాంగ్ చెబుతున్నారని విమర్శించారు. తాను వనజాక్షిపై చేయి చేసుకోలేదని ఆమె చెప్పిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తనపై ఉన్న రౌడీ షీట్‌ను ఎత్తి  వేయించుకోవాలని ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు. తాను తప్పు చేయలేదని... ఆ విషయం న్యాయస్థానాల్లో నిరూపించుకోగలన్నారు. అందుకే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ తాను ఎలాంటి కేసులను ఎత్తివేసేందుకు కూడా ప్రయత్నించలేదన్నారు. తమపై అన్ని కేసులు ఉన్నాయంటున్న డీజీపీ వాటిని న్యాయస్థానాల్లో నిరూపించగలరా అని సవాల్ చేశారు. 


Also Read : సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని డ్రైవర్ నిర్వాకం


సినిమా చూపించడంతో ఆర్జీవీని గౌతం సవాంగ్ మించిపోయారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో తనకు ప్రాణహాని ఉందని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. చింతపల్లిలో తనతో పోలీసులు వ్యవహరించిన తీరుతో తనకు ఆ రోజే ఆఖరు అనుకున్నాన్నారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణకావాలని..  సీఆర్పీఎఫ్‌తో రక్షణ కోసం తాను  కోర్టుకెళ్తానని ప్రకటించారు. 


చింతమేనేని ప్రభాకర్ వ్యక్తిగత పర్యటన కోసం నర్సీపట్నం ప్రాంతానికి వెళ్లినప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నారని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ఆ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. చింతమనేని ప్రభాకర్‌పై గంజాయి కేసు పెట్టాలన్న కుట్ర చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా డీజీపీకే లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చింతమనేని ప్రభాకర్‌పై అనేక కేసులు నమోదయ్యాయి . రెండు నెలలకుపైగా జైల్లో ఉన్నారు.