ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇక నుంచి ఏటా రూ. 50 కోట్లను చెల్లించనున్నది. ఇలా చెల్లించాలని ప్రభుత్వం  ఆర్డినెన్స్‌ జారీచేసింది. ఇప్పటివరకు టీటీడీ ఏటా రూ.2.25 కోట్లను మాత్రమే టీటీడీ చెల్లిస్తోంది. స్వామి వారి సొమ్మును వాడుకుటున్నారని ఇతర పార్టీలు, హిందూ సంఘాలు విమర్శలు చేస్తూండగా... ప్రభుత్వం మాత్రం ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకు రావని ఆలయాల కోసమే ఉపయోగిస్తారని చెబుతోంది. 


ఏటా రూ. 50 కోట్లు... ఐదేళ్లకు పది శాతం పెంపు..!


ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఉపయోగించే కామన్‌ గుడ్‌ ఫండ్‌ , ఉద్యోగుల వేతనాలకు ఉద్దేశించిన ఎండోమెంట్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఫండ్‌, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ల కోసం దేవదాయశాఖ తన పరిధిలోని ఆలయాల ఆదాయం నుంచి కొంత మొత్తం సేకరిస్తంది.  9 శాతం సీజీఎఫ్‌, 8 శాతం ఈఏఎఫ్‌, 3శాతం అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌కు తీసుకుంటుంది. అయితే టీటీడీనుంచి మాత్రం ప్రతి ఏటా స్థిరంగా తీసుకునేలా  1987లో  నిర్ణయించారు.ఈ ప్రకారమే తీసుకుంటున్నారు. తర్వాత కొన్ని ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నించినప్పటికీ నిబంధనలు అడ్డం వచ్చాయి. అదే సమయంలో భక్తుల సెంటిమెంట్‌ కూడా దెబ్బతినే అవకాశం ఉండటంతో ఏ ప్రభుత్వమూ పెంచే ప్రయత్నం చేయలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం  ఏటా రూ.50కోట్లు ఇచ్చేలా ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌లోనే ప్రతి ఐదేళ్లకో సారి పది శాతం పెంచాలన్న నిబంధన కూడా ఉంది.


Also Read : ఉప్పుతో వాస్తు దోషాలు తొలగించవచ్చా..?


ఆలయాలు, హిందూ ధర్మం కోసమే వినియోగం..! 


పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ, ఆదాయం లేక ఆదరణకు నోచుకోని గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల కోసమే టీటీడీ నుంచిరూ. 50 కోట్లను దేవాదాయశాఖకు ఇచ్చేలా ఆర్డినెన్స్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిధులేవీ ప్రభుత్వ ఖజానాకు చేరవని అందుకే శ్రీవారి నిధులు ప్రభుత్వం తీసుకుంటుందనే విమర్శలకు అవకాశమే లేదని చెబుతోంది. సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌,  అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌లకు   శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఇంద్రకీలాద్రి, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలు ప్రతి ఏటా రూ. పది కోట్ల వరకూ దేవాదాయశాఖకు అందుతున్నాయి. టీటీడీ నుంచి దేవాదాయ శాఖ తీసుకుంటున్న రూ. యాభై కోట్లలో కామన్‌ గుడ్‌ ఫండ్‌ -సీజీఎఫ్‌కి రూ.40 కోట్లు కేటాయిస్తారు. ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ, ధూపదీప నైవేద్య స్కీంకార్యక్రమాలకు మిగతా మొత్తాన్ని వెచ్చిస్తారు.


ఆలయాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి పైసా ఇవ్వని ప్రభుత్వం..!


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి బడ్డెట్‌లో చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం బడ్జెట్‌లో రూ.234 కోట్లను కేటాయించింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా కేటాయించలేదు. '2వేల జనాభా ఉన్న పంచాయతీకి రూ.30 వేలు, 5వేల  జనాభా ఉన్న పంచాయతీకి రూ.60 వేలు, 10వేల జనాభా ఉన్న పంచాయతీకి రూ.90వేలు, 10వేల పైన జనాభా ఉన్న పంచాయతీకి రూ.1.2 లక్షలు ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితెలిపారు.  అయితే ఆ నిధులు విడుదల కాలేదు. తర్వాత బడ్జెట్లలో అసలు కేటాయింపులు చేయలేదు.  దీంతో  ఆలయాలకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సాయం లేకుండా పోయింది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. భవిష్యత్ లో కూడా ఎలాంటి సాయం చేసే అవకాశం లేదు. అందుకే అందుబాటులో ఉన్న టీటీడీ పై దృష్టి పెట్టి నిధులను దేవాదాయశాఖకు సమీకరించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.


Also Read : ఇంటి ముందున్న తులసిమొక్క చెప్పే రహస్యం ఏమిటి..?
  
పాస్టర్లు, మౌజమ్‌లకు ప్రభుత్వ గౌరవ వేతనాలు.. కానీ ఆలయాలకు మాత్రం భక్తుల సొమ్మే..!


తక్కువ ఆదాయం వచ్చే ఆలయాల్లో నిత్య కైంకర్యాల కోసం, ధూపదీప నైవేద్యం కోసం భారీగా ఆదాయం ఉన్న ఆలాయల నుంచి సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌,  అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ల పేరుతో నిధులు వసూలు చేస్తున్న ప్రభుత్వం  మసీదుల్లో ఇమామ్‌, మౌజన్‌, చర్చిల్లో పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం మాత్రం ప్రభుత్వ నిధుల నుంచే ఇస్తోంది. ఇమామ్‌కు నెలకు రూ.10వేలు, మౌజన్‌, పాస్టర్లకు రూ.5వేలు చొప్పున గౌరవ వేతనాలు ఇస్తున్నారు. అదే తరహాలోనే ఆలయాలకూ ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని, ఆలయాలపై ఆధారపడొద్దన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది.  అలాగే మసీదులు, చర్చిలు నిర్మాణాలకు కూడా ప్రభుత్వం నిధులిస్తోంది. అలాగే ఆలయాల నిర్మాణానికి కూడా ప్రభుత్వమే నిధులు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.


 
టీటీడీలో ఎన్నో వివాదాలు..!


తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మొదటి నుంచి వివాదాస్పదం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న  శ్రీవారి ఆస్తులను అమ్మాలని ప్రయత్నించారు. వివాదం అవడంతో వెనక్కి తగ్గారు. పలు మార్లు భక్తులకు అందించే సేవల ధరల్ని పెంచారు. ఉచితంగా సేవలు అందించే వారిని పంపేసి ఖర్చు పెట్టి సేవల కాంట్రాక్టులు ఇవ్వడం దగ్గర్నుంచి నిన్నటి సంప్రదాయ భోజనం వరకూ  అన్ని వివాదాలే. ప్రస్తుతం జారీ చేసిన ఆర్డినెన్స్ కూడా వివాదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 


Also Read : తొండం లేని వినాయకుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?