కళకళలాడే రంగవల్లులు…ఇంటిగడపలకు పుసుపు రాసి కుంకుమబొట్లు, మామిడాకుల తోరణాలు, పూజల, వ్రతాలతో  ఈ నెల రోజులూ ఏ ఇల్లు చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతకరం.  శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి  జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయన పక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది. వేదాధ్యయనానికి బ్రహ్మోపదేశం తప్పనిసరి అని చెబుతారు. బ్రహ్మోపదేశ స్వీకరణకు సూచికగా యజ్ఞోప వీతధారణ చేస్తారు. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని ‘శ్రావణి’ అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం.


ఈ మాసం విశేషాలేంటంటే...


ఆగస్టు 9 శ్రావణ శుద్ధ పాడ్యమి
ఈ తిథి నుంచి శుక్ల పక్షం ఆరంభ మవుతుంది. శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరాలను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవం అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు. దర్భలను ‘పవిత్రం’ అంటారు. వీటికి మొదట పూజ చేసిన తరువాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురు దేవతల పేరుతో పంచుతారు. ఇదే పవిత్రారోపణోత్సవ పక్రియ.




శ్రావణ శుద్ధ విదియ
శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రా రోపణం’ అని స్మతి కౌస్తుభంలో ఉంది. దీనినే ‘మనోరథ ద్వితీయ’ అంటారు. ఈ రోజు పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనం చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. రెండోరోజు మంగళవారం కావడంతో మంగళగౌరీ వ్రతాలు చేస్తారు.


శ్రావణ శుద్ధ తదియ
ఈరోజు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలని కృత్యసార సముచ్చయము అనే  గ్రంథంలో ప్రస్తావించారు


 శ్రావణ శుద్ధ చవితి
ఈ తిథి విఘ్న పూజకు అత్యుత్తమైనదని గ్రంధాల్లో పేర్కొన్నారు.




శ్రావణ శుద్ధ పంచమి
శ్రావణ శుద్ధ పంచమిని కొన్ని వ్రత గ్రంథాలు నాగ పంచమిగా పేర్కొంటున్నాయి. ఈరోజు ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజిస్తారు. నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ఉంది. నాగపంచమి రోజు భూమి దున్నకూడదని అంటారు. అయితే నాగపంచమని విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. తెలంగాణలో శ్రావణ మాసంలో నాగపంచమిగా జరుపుకుంటే, ఆంధ్ర ప్రదేశ్‍లో మాత్రం కార్తీక మాసంలో నాగులను పూజిస్తారు.


శ్రావణ శుద్ధ షష్ఠి
ఈ రోజున శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి.


శ్రావణ శుద్ధ సప్తమి
శ్రావణ శుద్ధ సప్తమి చాలా విధాలుగా ముఖ్యమైన దినం. ప్రధానంగా ఈ తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని చెబుతారు. ఇది సూర్యారాధనకు సంబంధించినది.


శ్రావణ శుద్ధ అష్టమి
దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనదని పండితులు చెబుతారు. అయితే శ్రావణ శుద్ధ అష్టమి రోజు దుర్గా పూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అని కూడా అంటారు.


శ్రావణ శుద్ధ నవమి
ఈరోజున కౌమారీ పూజ చేయాలని చెబుతారు


శ్రావణ శుద్ధ దశమి
శ్రావణ శుద్ధ దశమిని ఆశా దశమి అంటారు. ఈరోజు చేసే వ్రతాచరణ వల్ల ఆశలు నెరవేరు తాయని ప్రతీతి. పగలు ఉపవాసం ఉండి…. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పొడవునా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యేది కూడా ఇప్పుడే…


శ్రావణ శుద్ధ ఏకాదశి
ఈ తిథిని పుత్ర ఏకాదశిగా పిలుస్తారు. మహిజిత్తు అనే ఆయన శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా కి పుత్ర సంతానం కలిగిందట. అందుకే పుత్ర ఏకాదశి అంటారని ప్రతీతి.


శ్రావణ శుద్ధ ద్వాదశి/ శ్రావణ శుద్ధ త్రయోదశి
ఈ ఏడాది త్రయోదశి రోజు వరలక్ష్మీ వ్రతం. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలతల్లిని పూజించడం ఆచారం.


శ్రావణ శుద్ధ చతుర్దశి
ఈ తిథి రోజు శివుడికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక 12-8-4 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి, ముడి ముడికి మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీలు 50, 38, 21 ఉండేలా పవిత్రాలు (దర్భలు) వేయాలి.  ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అంటారు.





ఆగస్టు 22-శ్రావణ శుద్ధ పౌర్ణమి
రక్షాబంధన్‍, రాఖీ పూర్ణిమ పేరుతో  వేడుక నిర్వహించుకోవడం ఆనవాయితీ. రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ. ఈ రోజు ‘అధ్యాయోపా కర్మ’ జరుపుతారు. అంటే, వేదాధ్యయన ప్రారంభం. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించాలి. మర్నాడు ఉపాకర్మాంగభూతంగా 1,008 సార్లు గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువ ఆచారంలో ఉంది. ఈరోజు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు.


శ్రావణ బహుళ (కృష్ణ) పాడ్యమి
శ్రావణ బహుళ పాడ్యమి రోజు ధనప్రాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మొదలు భాద్రపద పూర్ణిమాంతం వరకు వ్రతం చేయాలని..దీనినే శివ వ్రతమని కూడా అంటారని చెబుతారు.


శ్రావణ కృష్ణ విదియ
ఈ రోజు మొదలు నాలుగు నెలల పాటు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా కూడా ప్రసిద్ధి చెందింది.


శ్రావణ బహుళ తదియ
ఈనాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం చేయాలంటారు


శ్రావణ బహుళ చవితి
దీనినే ‘బహుళా చతుర్థి’ అని కూడా పిలుస్తారు. ఈరోజు గోపూజ చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని ఫలశ్రుతి.


శ్రావణ బహుళ పంచమి
ఇది రక్షా పంచమి వ్రత దినమంటారు.


 శ్రావణ బహుళ షష్ఠి
ఈ తిథి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలి… బలరామ జయంతిగా కూడా ప్రసిద్ధి.


శ్రావణ బహుళ సప్తమి
ఈ రోజు భానుసప్తమి అంటారు…




ఆగస్టు 30-శ్రావణ బహుళ అష్టమి
ఈ తిథి కృష్ణాష్టమి. శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవం. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, విజయం సిద్ధిస్తుందని పురాణోక్తి. అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగించి ఉయ్యాలలు కట్టి ఆడిస్తారు. బాల్యంలో కృష్ణుడు చేసిన బాల్య చేష్టలకు నిదర్శనంగా వీధుల్లో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు.


శ్రావణ బహుళ నవమి
ఈరోజు చండికా పూజ, కౌమార పూజ ఆచరిస్తారు. రామకృష్ణ పరమ హంస వర్ధంతి కూడా ఈ రోజే.


శ్రావణ బహుళ ఏకాదశి
ఈ ఏకాదశిని అజైకాదశి అనీ అంటారు. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు.


శ్రావణ బహుళ ద్వాదశి/త్రయోదశి
ద్వాదశి తిథి నాడు రోహిణీ ద్వాదశీ వర్షం అనే పూజ చేస్తారు. అలాగే, త్రయోదశి తిథి ద్వాపర యుగాది అని అంటారు. శ్రావణ బహుళ చతుర్దశి. అఘోర చతుర్దశి అని, మాస శివరాత్రి పర్వమని ఆమాదేర్‍ జ్యోతిషీ పేర్కొంటోంది.




సెప్టెంబరు 7 శ్రావణ బహుళ అమావాస్య
శ్రావణ కృష్ణ అమావాస్య పోలాల అమావాస్యగా ప్రసిద్ధి. గో పూజకు విశేషమైన దినం. ఈ రోజు కర్షకులు వ్యవసాయ సంబంధ పనులేమీ, ప్రత్యేకించి ఎద్దులతో ఏ పనీ చేయించరు.