శ్రీకృష్ణుడు కాళియమర్దనం చేసింది ఈ రోజే అని కూడా అంటారు. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకి బదులుగా... ఈ రోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు, విష్ణుమూర్తిని కోరాడని…స్పందించిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే…తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలో మానవాళి సర్ప పూజలు చేయాలనే వరం కోరుకున్నాడట ఆదిశేషుడు. అందుకే నాగుల పంచమి రోజు సర్ప పూజలు చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.





" విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః


 న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ "


ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు. వంశము అభివృద్ధి చెందుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయని చెబుతారు.


పుట్టపై పాలు పోసి.. పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించాలి.  ''కర్కోటకస్య నాగస్య'' అనే మంత్రాన్ని చదివితే కలి దోష నివారణ కలుగుతుందని శాస్త్రప్రవచనం. గ్రహదోషాలున్నవారు రాహుకేతువులను పూజిస్తే ఆ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆగస్టు 13న నాగపంచమికి ఉత్తర-హస్త నక్షత్రాల కలయికలో వచ్చిందని…108 ఏళ్ల తర్వాత ఇలా జరిగిందని వేదపండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజున నాగదేవతను పూజిస్తే.. నాగదోషాలు, కాలసర్ప దోషాలు రాహుదోషాలతో పాటూ సమస్త దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.





సర్పజాతి ఉద్భవించింది నాగపంచమి రోజునే…


కశ్యప ప్రజాపతికి వినత.. కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి 'నాగ పంచమి'గా పిలుస్తారు.ఈ రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే 'గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు.


సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెబుతారు.