సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందే నకిలీ వార్తలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఏకంగా పోలీసులు చెబుతున్నారనే తప్పుడు వార్తలతో మెసేజ్‌లు ఫార్వర్డ్ అవుతుండడంతో అమాయక జనం నమ్మేస్తున్నారు. ఇలాగే ఓ ఈ మెసేజ్ వైరల్ అవుతుండడం ఆ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆ నకిలీ సందేశాన్ని నమ్మి ఫార్వర్డ్ చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇంతకీ ఆ నకిలీ మెసేజ్ ఏంటంటే..
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 7 వరకు లోక్ అదాలత్‌లో పెండింగ్ చలానాలను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. వచ్చే నెలే అక్టోబరు కావడంతో ఈ సమయంలో ఈ మెసేజ్ ఇంకా వైరల్ అవుతోంది. దీంతో తాజాగా హైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. దీనిపై ట్విటర్ వేదికగా పోలీసులు హెచ్చరిక చేశారు.
‘ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్ అంటూ ఓ ఫేక్ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి, షేర్ చేయకండి. ఇలా ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్ లేదా షేర్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా అది నిజమేనని జరుగుతున్న ప్రచారానికి హైదరాబాద్ పోలీసులు స్పష్టత ఇచ్చి ఫుల్‌స్టాప్ పెట్టినట్లు అయింది.
ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీరు మారింది. ఒకప్పటిలా రోడ్డుపై వాహనాలను ఆపి చలాన్లు వసూలు చేసే కాలం పోయింది. ఇప్పుడంతా ఆన్‌లైన్ చలాన్ విధానం అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాన్‌లు నేరుగా ఫోన్‌కు మెసేజ్ వస్తున్నాయి. చలాన్‌ల తాలుకూ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పెండింగ్‌లో ఉన్న ఈచలాన్‌పై పోలీసులు బంపరాఫర్ ఇచ్చినట్లు ఇటీవల ఓ వార్త హల్చల్ చేస్తోంది.