తిరుమలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన "సంప్రదాయ భోజనం" అమ్మకాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. శ్రీవారి ప్రసాదాలను ఉచితంగా ఇవ్వాలని అమ్మకూడదని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీటీడీ బోర్డు లేని సమయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారని వివరణ ఇచ్చారు. "సంప్రదాయ భోజనం" విషయంలో ఇప్పటి వరకూ ప్రారంభమైన వివాదానికి సుబ్బారెడ్డి ప్రకటన ముగింపు ఇవ్వకపోగా .. వివాదానికి మరింత ఆజ్యం పోసే అవకాశం కనిపిస్తోంది.
26న తిరుమలలో " సంప్రదాయ భోజనం" ప్రయోగాత్మకంగా ప్రారంభం.!
గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో సిద్ధం చేసిన అన్నప్రసాదాలను " సంప్రదాయ భోజనం" గా పిలుస్తున్నారు. రెండు రకాల దేశీయ వరి బియ్యంతో అన్నం, పూర్ణం బూరెలు, బెల్లం పొంగలి, దోసకాయ పచ్చడి, బీరకాయ ప్రై, కొబ్బరన్నం, పులిహోర, బీన్స్ ఫ్రై, వడలు, పప్పు, సాంబారు, రసం వంటివి ఈ భోజనంలో ఉన్నాయి. ఆగస్టు 26వ తేదీన మొదటి సారిగా టీటీడీ సిబ్బంది,అధికారులు ఈ భోజనం స్వీకరించి లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించారు. అప్పట్నుంచి రోజుకు రెండు వందల మందికి ఈ సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందించాలని నిర్ణయించారు.
అమ్మాలని నిర్ణయించడంతో వివాదం..!
"సంప్రదాయ భోజనాన్ని" టీటీడీ తయారీ ధరకే అమ్మాలని నిర్ణయించడంతో వివాదం ప్రారంభమయింది. భక్తుల అభిప్రాయాలు తీసుకునేందుకు సెప్టెంబరు 8వరకు రోజుకు 200 మందికి సంప్రదాయ భోజనం అందించాలని నిర్ణయించారు. సెప్టెంబరు 8 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. దీని కోసం ఎక్కడెక్కడ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి వంటి నిర్ణయాలు కూడా పూర్తయ్యాయి. అయితే టీటీడీ నిర్ణయంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. " సంప్రదాయ భోజనం"కు ప్రశంసలు లభించినప్పటికీ.. కాస్ట్ టు కాస్ట్ పేరుతో అమ్మాలనుకోవడంతోనే పలువురు అనేక రకాల సందేహాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. భక్తులకు " సంప్రదాయ భోజనం" పేరుతో అమ్మి నిత్యాన్నదానం నిలిపివేస్తారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది దుష్ప్రచారమని సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రకటించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. బయట ఆహారాన్ని తీసుకోవాలనే శ్రీవారి భక్తులకు లాభాపేక్ష లేకుండా రుచికరమైన గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని అందించాలనే లక్ష్యంతోనే " సంప్రదాయ భోజనం" ప్రారంభించామని తెలిపింది.
శ్రీవారి అన్న ప్రసాదాలు అమ్మకూడదన్న టీటీడీ చైర్మన్..!
రెండో సారి కొత్తగా టీటీడీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి " సంప్రదాయ భోజనం" అమ్మకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. తిరుమలలో ఏ కార్యక్రమం నిర్వహించినా శ్రీవారి అన్న ప్రసాదాలు ఉచితంగానే పెట్టాలని అమ్మకూడదని స్పష్టంచేశారు. పాలక మండలి లేని సమయంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరణ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు మరింత వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీటీడీ చైర్మన్ - అధికారుల మధ్య పొసగడం లేదా..?
" సంప్రదాయ భోజనం" అమ్మకం నిర్ణయం అధికారులందటూ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు తిరుమలలో కలకలం రేపుతోంది. టీటీడీ చైర్మన్ ప్రకటన సంప్రదాయాల్ని ఉల్లంఘించి చేస్తున్నారని ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలను అంగీకరించినట్లయిందని.. అధికారుల్ని తప్పు పట్టినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీటీడీకి ఇప్పటికీ బోర్డు లేదు. చైర్మన్ ఒక్కరే ఉన్నారు. సభ్యులను ఇంకా ప్రకటించలేదు. గతంలో చాలా రోజుల పాటు చైర్మన్ కూడా లేరు. ఈవో, జేఈవో నేతృత్వంలోని స్పెసిఫైడ్ కమిటీనే నిర్ణయాలు తీసుకుంది. అప్పుడే భోజనం అమ్మకం నిర్ణయాన్ని తీసుకున్నారని టీటీడీ చైర్మన్ చెబుతున్నారు.