కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో కరోనాకు చికిత్స అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తుండటంతో ఇది సాధ్యమైందని వైద్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇక నుంచి ‘ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో ఈ పథకం అమలు కానున్నట్లుగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పథకాన్ని ప్రభుత్వం పరిమితం చేసింది. ఆ తర్వాత దశలవారీగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా చికిత్సను ఈ పథకం కింద అందించనున్నారు.


అయితే, ఈ పథకం కింద కరోనాకు అందించే చికిత్సలను మొత్తం 17 రకాలుగా విభజించారు. ఇందులో అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌, పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌, నిమోనియా వంటివి ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే చికిత్స అందించనున్నారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలుతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య మొత్తం 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. 


Also Read: Suryapet: మహిళ బట్టలిప్పేసి కళ్లలో కారం కొట్టి.. కర్రలతో కొడుతూ నగ్నంగా ఊరేగింపు


ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 పడకలున్న ఆసుపత్రులకు అనుమతి లభిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి ఆరు బెడ్స్ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ), 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. 6 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌‌ను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు


తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం 1,026 చికిత్సలు ఫ్రీగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ రెండింటిలో కామన్‌గా ఉన్న చికిత్సలు 810 వరకూ ఉన్నాయి. మరో 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌లో లేవు. ఈ చికిత్సలను గతంలో మాదిరిగానే ఇప్పుడూ కొనసాగించనున్నారు. ఆరోగ్యశ్రీ వల్ల తెలంగాణలో 77.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా.. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేవలం 24 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం ద్వారా చికిత్సలకయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి సుమారు రూ.250 కోట్ల వరకూ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ చికిత్సకయ్యే ఖర్చు పరిమితి ఉంటుంది. ఆయుష్మాన్‌ భారత్‌లో రూ.5 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంటుంది.


Also Read: Petrol-Diesel Price, 30 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో బాగా తగ్గుదల, తాజా రేట్లు ఇవే..


Also Read: India Wins Gold: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవని లేఖరా