Supreme Court Quashes Gujarat Decision on Bilkis Bano Case: గుజరాత్ (Gujarat)కు చెందిన బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో దోషులైన 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆ 11 మందిని 2 వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున.. దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తెలిపింది. అలాగే, ఈ కేసులో రెమిషన్ కోరుతూ దోషి చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ 2022 మార్చిలో సుప్రీంకోర్టు మరో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపైనా తాజా ధర్మాసనం స్పందించింది. వాస్తవాలను దాచి, మోసపూరిత మార్గాల ద్వారా దోషి ఆ ఆదేశాలు పొందలేడని పేర్కొంది.






ఇదీ జరిగింది


గుజరాత్ లో 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఈ అత్యాచార ఘటన జరిగింది. దుండగులు బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసి.. ఆ సమయంలో గర్భిణీ అయిన బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో విచారణ అనంతరం 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008, జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దోషులు 15 ఏళ్లు కారాగారంలో శిక్ష అనుభవించారు. అనంతరం తమను విడుదల చేయాలంటూ ఓ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతని విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సర్కారుకు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో 2022, ఆగస్ట్ 15న రిలీజ్ చేసింది. అయితే, గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకడైన రాథేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు.


సుప్రీంను ఆశ్రయించిన బాధితురాలు


దోషుల రిలీజ్ ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు మరికొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను.. గుజరాత్ ప్రభుత్వం అపహరించినట్లేనని న్యాయమూర్తి తెలిపారు. సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.


Also Read: Ayodhya Temple: సీతమ్మ వారికి సూరత్ నుంచి స్పెషల్ శారీ - అయోధ్య రామయ్యకు భారీగా కానుకలు