Surat Textile Industry: దేశంలోని సూరత్ (Surat) చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా గుజరాత్ (Gujarat) సూరత్ చీరలు ప్రాచుర్యం పొందాయి. అక్కడ తయారు చేసిన ప్రత్యేక చీరను జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిరం విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలకు పంపనున్నారు. ఈ వేడుకల్లో సీతమ్మ వారి కోసం సూరత్‌లో ప్రత్యేకంగా చీర తయారు చేశారు. ఆ చీరపై రాముడు, అయోధ్య ఆలయ చిత్రాలను ముద్రించారు. ఆదివారం టెక్స్ టైల్స్ పరిశ్రమ తరఫున లలిత్ శర్మ సీతమ్మ వారి కోసం తయారు చేసిన మొదటి కానుకను అందించారు.
అయోధ్య ఉత్సవంలో స్వయంగా పాల్గొనలేని భక్తులు తమకు చేతనైన విధంగా కానుకలు పంపుతున్నారు. అందులో భాగంగానే సీతమ్మ వారికి చీరను సూరత్ నుంచి అందిస్తున్నట్లు శర్మ చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్టించబడుతోందని, ప్రపంచమంతా ఆనందంగా ఉందని, సీతమ్మ, హనుమంతుడు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారి ఆనందాన్ని పంచుకుంటూ, రాముడి చిత్రాలు, అయోధ్య ఆలయం ముద్రించిన ప్రత్యేక చీరను అమ్మవారి కోసం సిద్ధం చేశామని, దాన్ని ఇక్కడ ఒక ఆలయంలో జానకీ దేవికి అందించామని, త్వరలోనే ఆ చీరను అయోధ్యలోని రామ మందిరానికి పంపుతామని చెప్పారు. దేశంలోని ఇతర రామాలయాల నుంచి వినతులు వస్తే సీతమ్మ వారి కోసం ఉచితంగా చీరలు పంపుతామని శర్మ వెల్లడించారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి రాకేష్ జైన్ అమ్మవారి కోసం ప్రత్యేకంగా చీరను తయారు చేశారు.
వజ్రాల కంఠాహారం
గుజరాత్‌లోని (Gujarat) సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా ఇటీవల అయోధ్య రాముడికి 5 వేల అమెరికన్ వజ్రాలతో కంఠహారం తయారు చేయించారు. రామాయణంలోని ముఖ్య పాత్రలను కళాకారులు ఈ హారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభం సందర్భంగా ఈ హారాన్ని రాముడికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 5 వేల అమెరికన్ వజ్రాలను, 2 కిలోల వెండిని ఉపయోగించి 40 మంది కళాకారులు 35 రోజులు శ్రమించి ఈ హారాన్ని తయారు చేశారు. కంఠహారంపై అయోధ్య రామమందిర నమూనాతో పాటు రామాయణంలోని ముఖ్య పాత్రలను మలిచారు.
అయోధ్యకు తిరుమల ప్రసాదం
అయోధ్యలో ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానుంది. ఈ వేడుక కోసం దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ వేడుకలకు దేశం నలుమూల నుంచి కానుకలు అందుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డూలను చేరవేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. ఈ లడ్డూలను తిరుమలలోని పోటులో టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయిస్తుంది. మామూలుగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు ఉంటాయి. అయితే అయోధ్యలో వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డూలను ఉచితంగా అందించనుంది. త్వరలో ఈ లడ్డూలు అయోధ్యకు చేరుకోనున్నాయి.
హైదరాబాద్ నుంచి ద్వారాలు
అయోధ్య రామాలయానికి హైదరాబాద్ నగరం నుంచి 118 దర్వాజాలు వెళ్లనున్నాయి. హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా రాముడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయి. రాముడికి సుమారు రూ 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను హైదరాబాద్ నగరానికి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ పాదుకలను 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు.