Supreme Court:
తోసి పుచ్చిన ధర్మాసనం..
కేంద్రం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరుస్తోందంటూ..14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. మోదీ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా ఈ దాడులు చేయిస్తోందంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నాయి. అయితే...ఈ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు...ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణను తిరస్కరించింది. గత నెల సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో ఈ పిటిషన్ వేయించాయి ప్రతిపక్షాలు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతే CBI, ED వేధింపులు ఎక్కువయ్యాయని అందులో ఆరోపించారు. దాదాుపు 95% కేసులు ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసుకునే పెడుతున్నారని మండి పడింది. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టుకు నివేదించాయి ప్రతిపక్ష పార్టీలు. కానీ సర్వోన్నత న్యాయస్థానం మాత్రం ఈ పిటిషన్‌ను తోసి పుచ్చింది. కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్, DMK సహా మరి కొన్ని పార్టీలు ఈ పిటిషన్ వేశాయి. బీజేపీలో చేరగానే అన్ని ఈ దాడులు ఆపేస్తున్నారని విమర్శించాయి. బీజేపీ మాత్రం ఈ విమర్శలను కొట్టి పారేస్తోంది. దర్యాప్తు సంస్థలు చట్టప్రకారమే నడుచుకుంటున్నాయని తేల్చి చెబుతోంది. స్వతంత్రంగా పని చేస్తున్నాయని వివరిస్తోంది.
గత నెల పిటిషన్..
గత నెల పిటిషన్ వేసిన సమయంలో సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ దీనిపైపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాలన కోరారు. CBI,EDలను తమకు వ్యతిరేకంగా పని చేసేలా బీజేపీ ఉసిగొల్పుతోందని 14 పార్టీలు పిటిషన్ వేశాయని వివరించారు. దాదాపు 95% మేర కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని చెప్పారు. బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసిన విషయాన్ని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన సుప్రీం కోర్టు ఏప్రిల్ 5న విచారిస్తామని వెల్లడించింది.
సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. మార్చి 24న సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పుని రిజర్వ్‌లో ఉంచిన కోర్టు...ఇప్పుడు ఈ తీర్పునిచ్చింది. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో సిసోడియా...ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. గత నెల 22న ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 5వ తేదీ వరకూ కస్టడీలోనే ఉండాలని తేల్చి చెప్పింది. ఇప్పుడు మరోసారి ఆ కస్టడీని పొడిగించింది. ఏప్రిల్ 17 వరకూ కస్టడీలో ఉంచేందుకు అనుమతించింది. ఇదే సమయంలో మనీశ్ సిసోడియా అభ్యర్థననూ పరిగణనలోకి తీసుకుంది. కస్టడీలోకి ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని సిసోడియా కోరారు.