Arunachal Border Renaming:
భారత్ వర్సెస్ చైనా..
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తన మొండి వాదనను కొనసాగిస్తూనే ఉంది. అది తమ భూభాగంలోనిదే అని తేల్చి చెబుతోంది. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ వాదనలతో సరిపెట్టుకోకుండా..అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌కు జంగ్నన్ (Zangnan)గా పేరు మార్చేసింది డ్రాగన్. పైగా...అది తమ అధికారం అని వాదిస్తోంది. ఈ నిర్ణయంపై భారత్ వెంటనే స్పందించింది. ఈ పేర్లు మార్పులతో సాధించేది ఏమీ లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.
"చైనా ఇలాంటి కుట్రలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ నిర్ణయాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ కచ్చితంగా భారత భూభాగంలోదే. పేర్లు మార్చినంత మాత్రాన ఈ నిజం నిజం కాకుండా పోదు"
- భారత విదేశాంగ శాఖ
భారత విదేశాంగ శాఖ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమే అని మరోసారి అదే వాదన వినిపించారు.
"జంగ్నన్ (అరుణాచల్ ప్రదేశ్) చైనా భూభాగానికి చెందినదే. స్టేట్ కౌన్సిల్‌తో సంప్రదింపులు జరిపి, భౌగోళిక పరిస్థితులన్నింటినీ సమీక్షించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. చైనా ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చాలని భావిస్తోంది. మాకున్న హక్కుల పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం"
-మావో నింగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
అమెరికా సపోర్ట్..
అరుణాచల్ ప్రదేశ్‌ను సౌత్ టిబెట్‌గా వ్యవహరిస్తోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రాంతాలకు పేర్లు మార్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. చైనా కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇదంతా జరుగుతోంది. నిజానికి...గతంలోనూ చైనా ఇలా పేర్లు మార్చాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను విడుదల చేసింది. ఆ తరవాత 2021లో 15 ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఆ జాబితా ప్రకటించింది. ఇప్పుడు మరోసారి ఇదే వ్యూహం అమలు చేస్తోంది. ఈ మొత్తం పరిణామాలను గమనించిన అమెరికా...చైనాపై విమర్శలు చేసింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికా భారత్‌కు మద్దతుగా నిలిచింది. మెక్‌మహాన్ రేఖకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా పాస్ చేసింది. మెక్‌మహాన్ రేఖను అరుణాచల్ ప్రదేశ్, చైనా మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పింది అమెరికా. ఎల్‌ఏసీ విషయంలో భారత్‌తో జరిగిన ఒప్పందాలను చైనా ఖాతరు చేయకపోవడంపై మండి పడింది. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని వెల్లడించింది. దాదాపు ఆరేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. గల్వాన్ ఘటనతో అది రుజువైంది. అరుణాచల్ ప్రదేశ్‌ను PRCలో భాగమే అన్న చైనా వాదనను అమెరికా చాలా తీవ్రంగా ఖండిస్తోంది.
Also Read:
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బులెట్ ప్రూఫ్ టెక్నాలజీ చూశారా? అమెరికా కూడా ఇంత అప్‌డేట్ అవ్వలేదు! - వైరల్ వీడియో