Bandi Sanjay FIR :    బండి సంజయ్ ఫలానా నేరం చేశాడని .. పోలీసులు  ఎఫ్ఐఆర్‌లో  పేర్కొనలేదు. భారత రాష్ట్ర సమితి నేతలు పేపర్ లీకుల వెనుక బండి సంజయ్ హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్‌లో అలాంటి ఆరోపణలు చేయలేదు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ టీ లక్ష్మిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తర్వాత వికారాబాద్, కమలాపూర్‌లలో క్వశ్చన్ పేపర్స్ లీకయ్యాయని .. ఇలా జరిగిన వెంటనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ మీడియా ప్రకటనలు ప్రారంభించారన్నారు. అమాయకులైన విద్యార్థులను రెచ్చ గొడుతున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చేలా ధర్నాలు .. ఇతర ఆందోళనలు జరిగే రెచ్చగొట్టేలా బండి సంజయ్ వ్యవహారం ఉందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు తెలిపారు. పరీక్షా కేంద్రాల ముందు ధర్నాలు చేయాలని తన అనుచరులను బండి సంజయ్ ఆదేశించినట్లుగా తనకు సమాచారం అందిందని ఫిర్యాదు చేసిన ఇన్స్ పెక్టర్ లక్ష్మిబాబు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇది పరీక్షల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నమని... విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశమన్నారు. 


కమలాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి గుర్తు తెలియని వ్యక్తులకు ఫార్వార్డ్ చేశారన్నారు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టిస్ చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశమని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. ఫరీక్షలు సజావుగా సాగడానికి .. శాంతిభద్రతల పరిరక్షణకు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కోసం బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం తప్పనిసరి అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అందుకే అర్థరాత్రి పూట కరీంనగర్‌లోని ఆయన ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 


కమలాపూర్‌లో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అందులోనూ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులు అని ఫిర్యాదు చేశారు.  కరీంనగర్‌లో  బండి  సంజయ్‌ను ప్రివెన్షన్ అరెస్ట్ చేసిన పోలీసులు మొదట హైదరాబాద్ తరలించారు.. తర్వాత వరంగల్ వైపు తరలించారు. దీంతో కమలాపూర్ లో హిందీ ప్రశ్నాపత్రం లీకైన కేసులో - . బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే బండి సంజయ్ ఎలాంటి నేరానికి పాల్పడ్డారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.  


పేపర్ ఇలా బయటకు రావడం వెనుక  బండి సంజయ్ కుట్ర ఉందని బయట   టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల వైపు నుంచి ఇంకా స్పష్టత రాలేదు.  పేపర్ బయటకు  పంపిన నిందితుడికి బండి సంజయ్ చాలా సార్లు కాల్ చేశారని...  ఆయనకు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో అందిందని  ప్రచారం జరుగుతోంది కానీ..  పోలీసులు ఇంకా ధృవీకిరించలేదు.  ఈ వ్యహారం రాజకీయ దుమారం రేగుతోంది.  బండి  సంజయ్ పై ఎన్ని కేసులు నమోదయ్యాయన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది.