Supreme Court Live Streams: దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ఇక నుంచి లైవ్‌లో చూడొచ్చు. మంగళవారం నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. ప్రస్తుతానికి యూట్యూబ్ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలోనే సొంత మాధ్యమం ఏర్పాటు చేయనుంది.
ప్రస్తుతానికి కొన్నే
ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారణలను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇతర ధర్మాసనాలను కూడా లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు సుప్రీం కోర్టు ఏర్పాట్లు చేస్తోంది. కోర్టులో జరిగే వాదనలకు, లైవ్ స్ట్రీమింగ్‌కు 30 సెకన్లు వ్యవధి తేడా ఉండనుంది. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
తొలి విచారణ
ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ సేన vs సేన కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో శిందే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, శిందే వర్గాల మధ్య పోరు నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ అధ్యక్షతన ఇడబ్ల్యూఎస్ కోటా కేసు విచారణ కూడా జరుగుతోంది. ఈ కేసు 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైంది. జస్టిస్ ఎస్కే కౌల్ అధ్యక్షతన జరిగే మూడో విచారణలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ చెల్లుబాటుకు సంబంధించిన అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి.
సీజేఐ నిర్ణయం
సీజేఐ జస్టిస్ లలిత్ అధ్యక్షతన ఇటీవల ఫుల్ కోర్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే సుప్రీం కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని, ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేయాలని తీర్మానించారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సహా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది.
సుప్రీం కోర్టు పనివేళలపై న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యూయూ లలిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోజూ ఉదయం 7 గంటలకే బడికి వెళ్లగలిగినప్పుడు, కోర్టులు కూడా రోజూ ఉదయం 9 గంటలకు విధులను ఎందుకు ప్రారంభించలేవని ప్రశ్నించారు.
Also Read: Shinzo Abe Funeral: షింజో అబేకు మోదీ కన్నీటి వీడ్కోలు- 100 దేశాల ప్రతినిధులు హాజరు!
Also Read: Russia-Ukraine War: 'పుతిన్ హెచ్చరికలు ఉత్తి మాటలు కావు- అణు యుద్ధం నిజమే కావొచ్చు'