మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమ సత్తా చాటుతూ దూసుకెళ్తున్నారు. అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నిబంధనల ప్రకారమే అవకాశాలు కల్పించాలని, అయితే లింగ వివక్ష ఆధారంగా విధానపరమైన నిర్ణయాలు సరికాదని పేర్కొంది. ఎన్డీయే పరీక్షలకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 


ఈ పిటిషన్ విచారించిన సుప్రీం ధర్మాసనం.. తమ తుది తీర్పునకు లోబడి ఎన్డీయేలో మహిళలకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. జస్టిస్  సంజయ్ కిషన్, రిషికేశ్ రాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనం  బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన మహిళలను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరకుండా అడ్డుకోవడం సరికాదని కోర్టు పేర్కొంది. లింగ వివక్ష ఆధారంగా మహిళలను ఏ విషయంలోనూ అడ్డుకోవడం సరికాదని, విధాన పరమైన నిర్ణయాలు అయితే ఏ ఇబ్బంది లేదని సూచించింది.
Also Read: తొలి మహిళా సీజేఐగా జస్టిస్ నాగరత్న? 2027 కల్లా.. సుప్రీం జడ్జిలుగా 9 మంది పేర్లు సిఫార్సు చేసిన కొలీజియం


మహిళలను ఎన్డీయేలో అనుమతించాలని, ఎంపిక అయిన వారికి పురుషులతో పాటు శిక్షణ ఇవ్వాలని.. లింగ వివక్ష సరికాదని ధర్మాసనం పేర్కొంది. కెరీర్‌లో ఉన్నతోదోగ్యోగ అవకాశాలలో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రస్తుత చట్టం చెబుతోంది. ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని... స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. తాము ఎలాంటి వివక్ష చూపలేదని.. విధాన నిర్ణయాల ప్రకారమే మహిళలకు ఎన్డీయే పరీక్షలకు అనుమతి ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు భారత ఆర్మీ తెలిపింది. ఇలాంటి నిర్ణయాలు సరికాదంటూ కోర్టు అక్షింతలు వేసింది. 


మీరు మీ మైండ్‌సెట్ మార్చుకోవాలి.. ఉత్తర్వులు జారీ చేయాలని మాపై ఒత్తిడి తీసుకురాకూడదని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. తాము ఏ విషయంలోనైనా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యానించింది. మరోవైపు సెప్టెంబరు 5న ఎన్డీయే పరీక్ష నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. మహిళలను పరీక్షకు అనుమతి ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. జస్టిస్ చంద్రచూడ్ తీర్పు అనంతరం సైతం ఇలాంటి నిర్ణయాలు ఎలా కొనసాగిస్తున్నారని కేంద్రాన్ని, ఇండియన్ ఆర్మీని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలకు ఆర్మీలో అవకాశాలకుగానూ శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో తీర్పు ఇచ్చారు. 
Also Read: హైకోర్టు ఆగ్రహిస్తున్నా ఉపాధి బిల్లులు ఏపీ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు ? అసలు వివాదం ఏమిటి..?


మహిళలను ఎన్డీయే పరీక్షకు హాజరు కాకుండా అడ్డుకోవడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. తాము సైతం దేశ సేవలో పాల్గొనాలని ఉత్సాహం చూపిస్తున్న ఆడవారిపై వివక్ష సరికాదని.. పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఎన్డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.