History of Indian Currency:
కేజ్రీవాల్ కామెంట్స్‌తో చర్చ..
చాలా రోజులుగా మన ఇండియన్ కరెన్సీ వార్తల్లో నిలుస్తోంది. డాలర్‌తో పోల్చి చూస్తే రూపీ విలువ పడిపోతోందని కొన్నాళ్లుగా గట్టిగానే చర్చ జరుగుతోంది. ఈ లోగా కరెన్సీకి సంబంధించిన మరో విషయం చర్చకు వచ్చింది. ఈసారి అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ "కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణపతి బొమ్మలు ముద్రిస్తే మన దేశం సుసంపన్నమవుతుంది" అని చేసిన కామెంట్స్‌పైరెండ్రోజులుగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. ప్రతిపక్షాలు ఆప్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు "అంబేడ్కర్ బొమ్మ" ముద్రించాలని అంటున్నారు. ఇంకొందరు జీసస్, అల్లా బొమ్మలూ ప్రింట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు RBI మాత్రం గతంలోనే ఓ విషయం స్పష్టం చేసింది. "కరెన్సీ నోట్ల ముద్రణలో ఎలాంటి మార్పులు ఉండవు" అని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే..అసలు మన ఇండియన్ కరెన్సీ ఎప్పుడు ఎలా మొదలైంది..? మొట్టమొదట ఏయే బొమ్మలు వాటిపై ముద్రించారు..? ఇప్పుడు చెలామణిలో ఉన్న కరెన్సీ నోటుని ఫైనలైజ్ చేసిందెవరు..? లాంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి.
మొఘల్ కాలం నుంచే..
మొఘల్ కాలం నుంచే భారత కరెన్సీలో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. స్వాతంత్య్రం సాధించుకున్న తరవాత ఈ మార్పుల వేగం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1934 యాక్ట్ కింద కరెన్సీని ప్రవేశపెట్టారు. RBI ఇష్యూ చేసిన నోట్లు మాత్రమే దేశంలో చెల్లుబాటు అవుతాయి. నిజానికి భారత్‌కు స్వాతంత్య్రం రాక ముందే RBI నోట్లు ముద్రించింది. మొట్టమొదటి సారి 1938లో రూ.5 నోటుని ఆర్‌బీఐ
ప్రవేశపెట్టింది. ఆ సమయంలో బ్రిటన్ రాజైన King George VI ఫోటోను ఆ కరెన్సీ నోటుపై ముద్రించింది. ఆ తరవాత క్రమంగా రూ.10, రూ.100, రూ.1000, రూ.10,000నోట్లు ముద్రించింది. బ్రిటీష్ కాలంలో ఈ నగదు బాగా చెలామణీ అయింది. స్వాతంత్ర్యం వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు ఇవి చెల్లుబాటయ్యాయి. అయితే..క్రమంగా వీటి డిజైన్‌లో మార్పులు చేర్పులు జరిగాయి. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఇండియన్ రూపీ రూపు రేఖలు మారిపోయాయి. అతి పెద్ద మార్పు మాత్రం 1949లో జరిగింది. British King George VI ఫోటోను తొలగించిన RBI ఆ స్థానంలో జాతీయ చిహ్నమైన అశోక చక్రాన్ని ముద్రించింది. కరెన్సీ రంగులోనూ మార్పులు తీసుకొచ్చింది RBI.1950లో రూ.2, రూ.5, రూ.10, రూ.100 కరెన్సీ నోట్ల రంగు, రూపుని పూర్తిగా మార్చేసింది. 1954లో తంజావూర్ ఫోటోతో రూ.1000నోటు ముద్రించింది. గేట్‌వే ఆఫ్ ఇండియా ఫోటోతో రూ. 5,000, అశోక పిల్లర్ ఫోటోతో రూ.10,000 నోటు ముద్రించింది. అయితే..1978లో అప్పటి ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయటం వల్ల ఇవి కనుమరుగయ్యాయి. 1953 వరకూ కరెన్సీ నోట్లపై హిందీ భాషే ఎక్కువగా కనిపించేది.
గాంధీ ఫోటో..
1980లో కొత్త నోట్ల ముద్రణ మొదలైంది. రూ.1 నోటుపైన ఆయిల్ రింగ్, రూ.2 నోటుపైన ఆర్యభట్ట ఫోటో, రూ.5 నోటుపైన రైతు, ట్రాక్టర్ ఫోటోలు, రూ.10 నోటుపైన నెమలి ఫోటో, రూ.20 నోటుపైన కోణార్క్ ఆలయ ఫోటో, రూ.100 నోటుపైన హిరాకుడ్ డ్యామ్ ఫోటోలు ముద్రించారు. మరి మహాత్మాగాంధీ ఫోటో కరెన్సీ నోటుపై ఎలా స్థిరపడిపోయిందనే కదా మీ అనుమానం. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరవాత 1949లో కరెన్సీ నోట్ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ సమయంలోనే కింగ్ ఫోటో బదులు, మహాత్మా గాంధీ ఫోటో ముద్రించాలని నిర్ణయించుకున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని కొత్త కరెన్సీ నోటును డిజైన్ చేశారు. 1969లో తొలిసారి మహాత్మా గాంధీజీ ఫోటోతో కరెన్సీ ముద్రణ మొదలైంది. మొట్టమొదట రూ.100 నోటుపైన గాంధీ బొమ్మ ముద్రించారు. ఆ తరవాత 1987లో రూ.500 నోటుపై ముద్రించటం మొదలు పెట్టారు. 1996లో గాంధీ ఫోటోతో కూడి కొత్త కరెన్సీని మార్కెట్‌లోకి విడుదల చేశారు.
సింబల్‌లోనూ మార్పు..
కరెన్సీ నోటులోనే కాదు. సింబల్‌లోనూ మార్పులు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ కరెన్సీని సూచించే సింబల్‌ని 2011లో మార్చారు. కొత్త రూపీ సింబల్ (₹)ను ప్రవేశపెట్టారు. 2015లో కరెన్సీలో మరి కొన్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేశారు. 2016లో నవంబర్ 8వ తేదీన పెద్దనోట్ల రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. వాటి స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అప్పుడే రూ.200 కరెన్సీ నోటు అందుబాటులోకి వచ్చింది.