AP Highcourt News: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రపై విధించిన ఆంక్షలు తొలగించాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు. పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు , ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. పాదయాత్రలో రైతులు 600 మంది మొదటి నుంచి చివర వరకూ పాల్గొనడం కష్టమని, రొటేట్ అవుతూ ఉంటారని న్యాయవాదులు చెప్పారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో వారి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని వాదించారు. పాదయాత్రలో పాల్గొనే వారికి ముందు, వెనుక సంఘీభావం తెలిపే వారు ఉంటారని న్యాయవాదులు పేర్కొన్నారు. సంఘీభావం తెలిపే వారిని రోడ్డుకు ఇరువైపులా ఉండాలని మొదటి ఉత్తర్వుల్లో లేదని ఈ నిబంధనల మార్చాలని కోరారు.
పాదయాత్రకు సంఘిభావం తెలిపే వారిపై ఆంక్షలు తొలగించాలని కోరిన రైతుల న్యాయవాదులు
అదే సమయంలో కోర్టు మధ్యాహ్నం ఉత్తర్వులు ప్రకటించిన వెంటనే పోలీసులు ఆంక్షలు విధించారని న్యాయవాది ఉన్నం మురళీధర్ చెప్పారు. వెంటనే ఆంక్షలు విధించి భోజనం చేసే ఫంక్షన్ హాల్‌కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమన్నారని పిటీషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. డీజీపీ కార్యాలయం 150 మందికి మాత్రమే ఐడీ కార్డులు ఇచ్చారన్నారు. ఈ విషయంపై విచారణకు తమకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును అడిగారు. అయితే తాము పాదయాత్రను పోలీసుల ఆంక్షలు కారణంగా బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల వెంటనే విచారించాలని పిటీషనర్లు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అన్ని పిటీషన్‌లను కలిపి విచారించి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం, పిటీషనర్‌లు ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని హైకోర్టు కోరింది.
పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని కోరిన ప్రభుత్వం
యాత్రపై కోర్టు ఆంక్షలు విధించిన తర్వతా పోలీసులు దూకుడుగా వ్యవహరించడంతో యాత్ర కొనసాగింపుకు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్న సమయంలో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి న్యాయస్థానం మార్గదర్శకాల మేరకు అరసవల్లి వరకు పాదయాత్ర కొనసాగిస్తామని అమరావతి రైతులు వెల్లడించారు. రేపు కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నదానిపై పాదయాత్ర ఎలా సాగుతుందనేది వెల్లడయ్యే అవకాశం ఉంది.
వాదనలకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో శుక్రవారానికి విచారణ వాయిదా
అమరావతి రైతుల పాదయాత్ర మొదటి నుంచి రాజకీయంగా పెను సంచలనం అయింది. రైతుల పాదయాత్ర మొదట్లో సాఫీగా సాగినా తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతల హెచ్చరికలతో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతీ రోజూ వైఎస్ఆర్‌సీపీ నేతలు నిరసనలు చేస్తున్నారు. దీంతో రాజకీయంగానూ దుమారం రేగుతోంది. చివరికి పాదయాత్ర అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వమే హైకోర్టులో పిటిషన్ వేసింది. మరో వైపు రైతులు కూడా ఆంక్షలపై పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురి స్పందనను బట్టి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.