కాలమే సమాధానం చెబుతుంది : పార్థ ఛటర్జీ
ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అది తనది కాదని తేల్చి చెప్పారు పశ్చిమ బంగ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో, కాలమే చెబుతుందని అన్నారు. జోకాలోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చిన సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు ఛటర్జీ. "మీపైన కుట్ర జరుగుతోందా" అని అడగ్గా, టైమ్ వచ్చినప్పుడు అదే తెలుస్తుంది
అని బదులిచ్చారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించిన విషయంపైనా స్పందించారు. "నన్ను మంత్రి పదవి నుంచి తొలగించటం వల్ల నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుంది. మమతా తీసుకున్న నిర్ణయం సరైందే" అని సమర్థించారు. టీఎమ్‌సీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ ఇప్పటికే పలు సందర్భాల్లో పార్థ ఛటర్జీ గురించి ప్రస్తావించారు. "ఆయన ఏ తప్పు చేయకపోతే బహిరంగంగా వచ్చి మాట్లాడొచ్చు కదా. ప్రజలకు వివరణ ఇవ్వచ్చు కదా" అని ప్రశ్నించారు. ఆ తరవాతే పార్టీ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటన చేసింది. ఆయనకు, ఈ కేసులు ఎలాంటి సంబంధం లేకపోతే కోర్టులోనే ఆ వివరణ ఇచ్చుకోవచ్చని, పార్టీకి ఆ స్కామ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది టీఎమ్‌సీ అధిష్ఠానం.
ఆ డాక్యుమెంట్లపైనే ఈడీ అధికారుల దృష్టి
అంతకు ముందు కూడా తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు పార్థ ఛటర్జీ. "నాపై కుట్ర జరుగుతోంది. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఈ కుట్రలో నేనొక బాధితుడినయ్యాను" అని పార్థ ఛటర్జీ అన్నట్టు ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ భారీ కుంభకోణంలో పార్థ ఛటర్జీ హస్తం ఉందని అంతా భావిస్తున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. "అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్నే అనుసరిస్తాం. అనుకున్న గడువులోగా ఈడీ అధికారులు విచారణను పూర్తి చేయాలి" అని టీఎమ్‌సీ నేత అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. ఇక పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ డబ్బు విషయమై మాట్లాడారు. తన ఇళ్లలో ఇప్పటి వరకూ దొరిగిన డబ్బంతా పార్థ ఛటర్జీదేనని వెల్లడించారు. ఆయన సన్నిహితులు కొందరు ఈ నగదుని తన ఇంటికి తీసుకొచ్చి పెట్టారని చెప్పారు. కొన్ని సార్లు స్వయంగా ఛటర్జీయే వచ్చి తన ఇంట్లో డబ్బు దాచారని స్పష్టం చేశారు. డబ్బు ఉన్న రూమ్‌లోకి ఎవరినీ వెళ్లనిచ్చే వారు కాదని, తనను కూడా అనుమంతించలేదని అన్నారు అర్పిత ముఖర్జీ. విచారణలో భాగంగా ఆమె చెప్పిన సమాధానాలను ఈడీ అధికారులు తెలిపారు. ఇటీవల ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా, రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు రూ.28 కోట్ల నగదునీ స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను ఈడీ ఇన్వెస్టిగేటర్లు పరిశీలిస్తున్నారు. ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల అడ్రెస్, అర్పిత ముఖర్జీ ఇంటి అడ్రెస్ మ్యాచ్ అవుతున్నాయని వెల్లడించారు.
Also Read: IND W vs PAK W T20 Match: టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు పాక్ విలవిల! 100 లోపే కుప్పకూలిన దాయాది