IND W vs PAK W T20 Match: కామన్వెల్త్‌ క్రికెట్‌ రెండో మ్యాచులో టీమ్‌ఇండియా మెరుగ్గానే ఆడుతోంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న టీ20లో దాయాది పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే నియంత్రించింది. స్నేహ్‌ రాణా (2/15), రాధా యాదవ్‌ (2/18) కు తోడుగా మిగతా బౌలర్లు విజృంభించడంతో ప్రత్యర్థి విలవిల్లాడింది. 9 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.  ఓపెనర్‌ మునీబా అలీ (32; 30 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్‌. అలియా రియాజ్‌ (18; 22 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించింది. వర్షం కారణంగా మ్యాచును 18 ఓవర్లకు కుదించారు. రేణుకా సింగ్‌, మేఘనా సింగ్‌, షెపాలీ వర్మ తలో వికెట్‌ తీశారు. 


బౌలర్ల హవా


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు శుభారంభం దక్కలేదు. ఒక పరుగు వద్దే ఓపెనర్‌ ఇరామ్‌ జావెద్‌ (0)ను మేఘనా సింగ్‌ డకౌట్‌ చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ బిస్మా మరూఫ్‌ (17)తో కలిసి మరో ఓపెనర్‌ మునీబా అలీ నిలకడగా ఆడింది. ఆచితూచి ఆడుతూనే బౌండరీలు బాదింది. దాంతో పవర్‌ప్లేలో పాక్‌ 25/1తో నిలిచింది. స్నేహా రాణా బంతి అందుకోవడంతో వారి పతనం మొదలైంది. జట్టు స్కోరు 50 వద్ద బిస్మా, 51 వద్ద ముబీనాను ఔట్‌ చేసింది. ఈ క్రమంలో ఒమైమా సొహైల్‌ (10), అయేషా నసీమ్‌ (10), అలియా రియాజ్‌ పోరాడే (18) ఇన్నింగ్స్‌ నిలబట్టే ప్రయత్నం చేశారు. కీలక సమయాల్లో భారత బౌలర్లు వారిని పెవిలియన్‌ పంపించడంతో పాక్‌ 99కి పరిమితమైంది.