Police Vs Politicians : కనిపించని నాలుగో సింహమే పోలీస్ అన్న మాటలు వెండితెరపై మాత్రమే చెల్లుతాయి అన్న విషయం మరోసారి రుజువైంది. ఈ మధ్యకాలంలో పోలీసులపై పొలిటిషియన్ల చేతి దురద ఎక్కువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం వరసగా జరుగుతున్న ఘటనలే. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ పోలీస్ అధికారిపై ఆయన వ్యవహరించిన తీరు ఈ చర్చకు దారితీస్తోంది. భోపాల్ జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తూ దిగ్విజయ్ సింగ్ ఆఫీసు ఆవరణలోకి దూసుకువచ్చారు. నకిలీ మెడికల్ సర్టిఫికేట్లతో బీజేపీ 9 ఓట్ల తేడాతో ఇక్కడ విజయం సాధించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత విశ్వాస్ సారంగ్ , కాంగ్రెస్ శ్రేణుల మధ్య నువ్వానేనా అన్నట్లు తోపులాట జరిగింది. దీన్ని అడ్డుకునే క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో దిగ్విజయ్ ఓ పోలీస్ అధికారి కాలర్ పట్టుకున్నారన్న విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడం , వాళ్లు విచారణకు హాజరుకావడాన్ని ఆపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు, ధర్నాలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల ఆ పార్టీ నేతలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న విమర్శలున్నాయి.
రేణుకా చౌదరి కూడా
కొద్ది రోజుల క్రితం తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ఓ పోలీసు కాలర్ పట్టుకున్నారు. ఈడీ విచారణని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కొనసాగించాయి. ఈ క్రమంలో నేతలను తరలించే క్రమంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు రేణుకాచౌదరి. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా పోలీస్ స్టేషన్ లో చేసిన రచ్చ కూడా వివాదాస్పదమైంది. సీఐకి వేలు చూపించి మాట్లాడిన తీరుపై విమర్శలొచ్చాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హస్తం బాటలోనే కమలం నేతలు
కాంగ్రెస్ నేతలు మాత్రమే కాదు బీజేపీ నేతలు కూడా తక్కువేం తినలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసు అధికారిని తోసేసిన ఘటన రాజకీయదుమారం లేపింది. తన కారుని అడ్డుకున్నారన్న కోపంతో పోలీస్ అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయన్ను తోసేసిన సీన్ సోషల్ మీడియాలోనూ హైలెట్ అయ్యింది. ఇలా అధికార, విపక్షాలన్న తేడా లేకుండా పోలిటిషియన్లందరూ పోలీసులతో దురుసుగా మాట్లాడం, వారిపై చేయిచేసుకున్న ఘటనలు తరచూ జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులు పబ్లిక్ లో ఓ గవర్నమెంట్ అధికారిపై ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయనేతల తీరుపై పోలీస్ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన సహకారం రావడం లేదన్న అసంతృప్తి కూడా ఉంది.