Sri Lanka Crisis: 


శ్రీలంకలో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనా...ప్రజాగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉంది. రణిల్ విక్రమసింఘేను ప్రధానిగానే అంగీకరించని లంకేయులు..ఆయన అధ్యక్ష పదవి చేపట్టటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులు కొలంబోలోని ప్రెసిడెంట్ సెక్రటేరియట్‌ను ముట్టడించారు. సెక్రటేరియట్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించగా...లంక సైన్యం వచ్చి వారిని అడ్డుకుంది. ఇప్పటికే అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లను స్వాధీనం చేసుకున్న ఆందోళనకారులు తరవాత బయటకు వచ్చారు. ఇప్పుడు సెక్రటేరియట్‌ను అధీనంలోకి తెచ్చుకునేందుకు చూడగా సైనికులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో నిరసనకారులు, సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు. ఆందోళనలు ఉద్ధృతం అవటం వల్ల మరికొందరు సైనికులు వచ్చారు. నిరసనకారులు రెండు రోజుల క్రితమే కొలంబోకు చేరుకున్నారు. రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు మనశ్శాంతి" అని వాళ్లు చెబుతున్నారు. "కావాలనే మమ్మల్ని అణిచివేస్తున్నారు. ఇదంతా రణిల్ విక్రమసింఘే చేయిస్తున్నదే. కానీ మేము వెనక్కి తగ్గం. దేశాన్ని ఈ కుటిల రాజకీయాల నుంచి కాపాడుకుంటాం" అని నినదిస్తున్నారు.





 
 


హింసను ప్రేరేపిస్తే ఊరుకోం: రణిల్ విక్రమసింఘే



నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నిరసనకారులకు హెచ్చరికలు చేశారు. ప్రెసిడెంట్ సెక్రటేరియట్‌ను స్వాధీనం చేసుకోవాలనుకోవటం నేరమని, ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. శాంతియుత నిరసనలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, కానీ హింసను ప్రేరేపిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని వెల్లడించారు. ఇక రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు సెక్రటేరియట్‌లోనే జరుగుతాయి. ఇప్పుడక్కడే ఆందోళనలు జరుగుతుండటం వల్ల సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది.