Weather Latest News: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం తుఫాను ప్రసరణ జార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాతాల్లో అధికంగా ఉంది. ఇది 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి దక్షిణం దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో  శుక్రవారం (జూన్ 22) భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


ఈ వాతావరణ పరిస్థితుల వేళ ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటు దక్షిణ కోస్తాలో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.










హెచ్చరికలు
భారీ వర్షాలు, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో ఐఎండీ కీలక వ్యాఖ్యలు చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు సరైన ప్రదేశంలో ఉండాలని, చెట్ల కింద అస్సలు ఉండొద్దని సూచించింది. చెట్ల కింద ఉండే పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రైతులు ఈ భారీ వర్షం తగ్గే వరకూ పనులను వాయిదా వేసుకోవాలని సూచించింది. చెరువులు, కుంటలు, నాలాలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని నిర్దేశించింది.


Telangana Weather: తెలంగాణలో ఇలా
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.  పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 25 వరకు మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని చెప్పారు. ఈ 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.






నేడు ఉదయం (22 జూన్ ఉదయం 5 గంటలకు) ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాబోయే 3 గంటల్లో సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.