IMD Forecast: నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (IMD) శనివారం తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర, కోస్తా, ఉత్తర కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు రోజులలో వాయువ్య భారతదేశంలో కొన్ని చోట్ల తుఫాను ఏర్పాడే అవకాశం ఉంది. దీంతో గోవా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో తూర్పు భారతదేశం, ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది.
రానున్న మూడు నాలుగు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు (ముంబయితో సహా), తెలంగాణా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ-మధ్యలోని మిగిలిన భాగాలు, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించనున్నాయి.
ఈ ప్రాంతాల్లో తుఫాను
వాయువ్య మధ్యప్రదేశ్ , బీహార్ దిగువ ప్రాంతాలలో తుఫాను ఏర్పడుతోంది. దాని ప్రభావంతో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని గంగా మైదానాల్లో రానున్న నాలుగైదు రోజుల్లో ఉరుములు, మెరుపులు , బలమైన గాలులతో (30-40 kmph) అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. జూన్ 12 నుండి బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని గంగా మైదానాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఐదు రోజులు వానలే వానలు
కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, కర్ణాటక, కేరళ , లక్షద్వీప్‌లలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (40-50 kmph) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి 11తేదీల మధ్యకాలంలో కేరళ , మహేలలో.. 8 నుంచి 9తేదీల మధ్యలో కర్ణాటకలో, 10న తెలంగాణపై .. జూన్ 08న కేరళ, మాహేలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి 11 మధ్యకాలంలో కొంకణ్ & గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్టల్, ఉత్తర కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 10, 11 తేదీల్లో సెంట్రల్ మహారాష్ట్రలోని కొంకణ్, గోవాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వేడి గాలుల ప్రభావం
ఈశాన్య మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలలో 8 నుంచి 11 తేదీలలో, బీహార్‌లో 9 ,10 తేదీలలో, ఒడిశా, పంజాబ్, హర్యానాలలో జూన్ 9 నుంచి 11 తేదీల మధ్య వేడిగాలులు వీచే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి 11 మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉంది. 8వ తేదీన బీహార్‌లోని వివిధ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీర ప్రాంతాలు, ఒడిశా, జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ ఏం చెప్పింది?
ఆదివారం నాటికి తూర్పు భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పెద్దగా మార్పు ఉండదు. ఆదివారం వరకు వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత 2-3 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉంటుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు.