Aarogyasri Scheme In Telangana: హైదరాబాద్: ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు చేర్చగా, 1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ (Aarogyasri) పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పెంచింది.  వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం, కాగా శనివారం (జూన్ 8న) డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


2007 లో కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకం ఆరోగ్యశ్రీ 
రాజీవ్ ఆరోగ్యశ్రీ (Aarogyasri) పథకం కింద కొత్త చికిత్సా విధానాల కోసం, ప్రస్తుతం ఉన్న పథకాల ఆర్థిక సవరణ కొరకు రాష్ట్ర సచివాలయంలో  మంత్రి భట్టి విక్రమార్క మల్లు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము 2007 లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రెవేశపెట్టడం తెలిసిందే. ఈ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 10  లక్షల వరకు ఆర్ధిక సహాయం ఈ పథకం ద్వారా అందుతోంది. రాష్ట్రం లో 1402 ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు.  ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో వున్నాయి. ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూసకు సంబంధించిన 65 అధునాతన ట్రీట్మెంట్‌లను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా ప్రభుత్వంపై దాదాపు 189.83 కోట్ల భారం పడనుంది. 65 కొత్త చికిత్సా విధానాలు అంగీకరించడం వల్ల ప్రభుత్వo 158.20 కోట్ల ఖర్చు చేయనుందని తెలిపారు. ఓవరాల్‌గా పై సవరణల వల్ల, కొత్త చికిత్సా విధానాలు చేర్చడం కోసం, ప్రభుత్వం అదనంగా 497.29 కోట్లు మంజూరు చేసినట్లు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.


Also Read: Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు - ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు